‘ప్రజాశాంతి పార్టీ గుర్తు మార్చమన్నాం’

28 Mar, 2019 14:31 IST|Sakshi

సాక్షి, న్యూడిల్లీ: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్పడుతున్న అధికార దుర్వినియోగాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు గురువారం ఈసీ ఫుల్‌ కమిషన్‌ సభ్యులతో వైఎస్సార్‌సీపీ నేతలు భేటీ అయ్యారు. ఈసీని కలిసినవారిలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఈ సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను తొలగించాలని ఈసీకి మరోసారి విజ్ఞప్తి చేశాం. కేఏ పాల్‌ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థుల పేర్లు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థుల పేర్లతో పోలి ఉన్నాయని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం.  ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాఫ్టర్‌ను ఉపసంహరించాలని కోరాం. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వ్యవహారంలో వివాదస్పద జీవో అంశాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఈసీ ఆదేశాలను ఉల్లఘించేందుకు చీఫ్‌ సెక్రటరీతో చంద్రబాబు చర్చలు జరిపారు. చంద్రబాబు రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించారు. గతంలో మేము ఇచ్చిన వినతిపత్రంలోని చాలా అంశాలపై సీఈసీ చర్యలు తీసుకోలేదు.

ఈసీ ఉత్తర్వులతో మేము సంతృప్తి చెందలేదు. డీజీపీ తన వాహనంలో 35 కోట్ల రూపాయలను ప్రకాశం జిల్లాకు చేరవేశారు. ఠాకూర్‌ విషయంలో న్యాయం జరగలేదని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. ఠాకూర్‌ సహా కొందరు పోలీసు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నంద్యాల ఎన్నికల్లో ఠాకూర్‌ పోషించిన పాత్ర ఆయన మనస్సాక్షికి తెలుసు. ఈసీ ఆదేశాలను చంద్రబాబు ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారో వారికి వివరించాం. దామోదర్‌నాయుడు, ఘట్టమనేని శ్రీనివాసరావు, యోగానంద, ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌, చిత్తూరు జిల్లా ఎస్పీ, గుంటూరు జిల్లా రూరల్‌ ఎస్పీలపై ఈసీ బదిలీ చేయలేద’ని తెలిపారు.

వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతాడని విమర్శించారు. ఓటర్లలో అయోమయం సృష్టించేందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లు, ఇంటి పేర్లు కలిగిన వారితో ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్లు వెయించారని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు