విశ్వసనీయత... విధేయత...

8 Jun, 2019 11:14 IST|Sakshi

జిల్లాకు దక్కిన రెండు అమాత్య పదవులు

బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీవాణిలకు కేబినెట్‌లో చోటు

బీసీ సామాజిక వర్గంలో బలమైన నేత బొత్స

ఎస్టీ ప్రజల ప్రేమాభిమానాలు పొందిన పుష్పశ్రీవాణి

సామాజిక న్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

రాష్ట్ర కేబినెట్‌లో జిల్లాకు తగిన ప్రాధాన్యం లభించింది. ఇద్దరిని మంత్రి పదవులు వరించాయి. ఒకరు అనుభవంలో దిట్ట... మరొకరు విశ్వసనీయతకు మారుపేరు. వారే బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి. సామాజిక వర్గ సమతూకం పాటించి... పాత కొత్తలను మేళవించి... పార్టీ పురోగమనమే లక్ష్యంగా భావించి... సంచలన నిర్ణయంతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం జిల్లావాసులను ఆనందంలో ముంచెత్తింది.

సాక్షిప్రతినిధి, విజయనగరం: అనుభవానికి, విశ్వసనీయతకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టం గట్టారు. సీనియర్‌ నేత బొత్ససత్యనారాయణ, ఎస్టీ మహిళా నేత పాముల పుష్పశ్రీవాణిలకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్వవస్థీకరణ ఉంటుందని, కొత్తవారికి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చి అసంతృప్తి అనేదే లేకుండా సుపరిపాలనవైపు అడుగులు వేయిస్తున్నారు. పరిచయం అవసరం లేనిసీనియర్‌ ప్రజా ప్రతినిధి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకుడిగా ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రాధాన్యక్రమంలోనే ఉంటారు. ప్రజా సేవలో తాను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చిన అసలు సిసలైన రాజకీయ నేతగా కీర్తి గడించారు. తన ఎదుగుదలకు పునాది వేసిన చీపురుపల్లి నియోజకవర్గంపై అమితమైన ప్రేమాభిమానాలను మదినిండా నింపుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో వైఎస్సార్‌సీపీ నుంచి అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొం దారు.

ఇప్పుడు ఏకంగా జగన్‌ మంత్రి వర్గం లో స్థానం సంపాదించారు. విద్యార్థిసంఘ నాయకుడిగా మొదలుపెట్టి, డీసీసీబీ చైర్మ న్, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, పీసీసీ అధ్యక్షు డు వంటి అత్యున్నత హోదాల్లో పనిచేసిన అనుభవం బొత్సకు ఉంది. దివంగత ము ఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హ యాంలో కీలక భూమిక పోషించిన బొత్స తదనంతర పరిణామాల్లో జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలబడ్డారు. సతీమణి బొత్సఝాన్సీ కూడా ఎంపీగా పనిచేసిన అనుభవంతో పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. జిల్లాలో జగన్‌ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న సమయంలోనూ, విజయమ్మ జిల్లాలో పర్యటించినపుడు వారి వెన్నంటి ఉన్నారు.  బొత్స   దంపతులు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి అహర్నిశలు పరితపించారు. జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కృ షి చేశారు. రాష్ట్రంలో పార్టీ విజయదుందుభి మోగించడానికి అవసరమైన ప్రణాళికల రచనల్లో జగన్‌కు చేదోడువాదోడుగా ఉన్నారు. బొత్స అనుభవం రాష్ట్రంలో సంక్షేమ పాలనకు అవసరమని భావించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన టీమ్‌లో బొత్స సత్యనారాయణ ప్రాధాన్యం ఇచ్చారు.

గిరిజనులకు అండదండ... పుష్పశ్రీవాణి
గిరిజనులు తమ ఇంటి ఆడబిడ్డగా భావించే పాముల పుష్పశ్రీవాణి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం దొరమామిడి నుంచి విజయనగరం జిల్లాకు కోడలిగా వచ్చారు. 2014లో కురుపాం నియోజకవర్గం చినమేరంగికి చెందిన శత్రుచర్ల పరీక్షిత్‌రాజును వివాహం చేసుకున్నారు. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె పరీక్షిత్‌ను వివాహమాడి అదే ఏడాది ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో 19 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. మొదటి నుంచీ వైఎస్‌ కుటుంబాన్ని అమితంగా అభిమానించే శ్రీవాణి తనకేదైనా కష్టం వస్తే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటో దగ్గరకు వెళ్లి చెప్పుకుంటుంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు దేవుడితో సమానమని అంటుంటారు. తాము విలువలకే ప్రాధాన్యం ఇస్తామని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించారు. టీడీపీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా... ఎంతటి ప్రలోభాలు ఎదురైనా లొంగలేదు. జగన్‌పైనే విశ్వసనీయత చూపించారు. తమకున్న అభిమానాన్ని చాటిచెప్పడం కోసం చేతిపై ‘వైఎస్‌ఆర్‌’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలకోసం నిరంతరం పోరాడారు. తాజా ఎన్నికల్లో ఆమెను ఓడించేందుకు టీడీపీ చేసిన వశ్వప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆమెపైనా, ఆమె భర్తపైనా హత్యాయత్నానికి పాల్పడినా బెదరలేదు. అనేక కుట్రలను ఎదుర్కొని ఈ రోజు మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు.

పేరు:    పాముల పుష్పశ్రీవాణి
తండ్రి:    నారాయణరావు
తల్లి:    గౌరీ పార్వతి
భర్త:    శత్రుచర్ల పరీక్షిత్‌రాజు
గ్రామం:  చినమేరంగి,  విజయనగరం జిల్లా
విద్యార్హతలు:     బీఎస్సీ, బీఈడీ
పుట్టినతేది:    22–6–1986

పేరు : బొత్స సత్యనారాయణ
విద్యార్హత:    బీఏ, మహారాజా కళాశాల,విజయనగరం
తండ్రి:    బొత్స గురునాయుడు
తల్లి:    ఈశ్వరమ్మ
భార్య :    బొత్స ఝాన్సీలక్ష్మి(మాజీ ఎంపి)
జననం :    9–7–1958
పిల్లలు :    ఒక కుమారుడు, ఒక కుమార్తె
నివాసం :    కోరాడ వీధి, విజయనగరం

పొలిటికల్‌ కెరీర్‌:
1978–80: విజయనగరం మహరాజా కళాశాలలో విద్యార్థి సంఘ నాయకత్వం
1992–99: విజయనగరం డీసీసీబీ చైర్మన్‌
1996, 1998లో ఎంపీగా పోటీ చేసి ఓటమి
1999లో ఎంపీగా గెలుపు
2004, 2009: చీపురుపల్లి ఎమ్మెల్యేగా విజయం.
2004 నుంచి వైఎస్సార్‌ కేబినెట్‌లో మొదటి విడతలో భారీ పరిశ్రమలశాఖ, రెండవ విడతలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా పని చేశారు.
రోశయ్య కేబినెట్‌లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్‌ కేబినెట్‌లో రవాణాశాఖా మంత్రిగా పని చేశారు.
2012 – 2015: పీసీసీ చీఫ్‌గా
అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరారు.
2019 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై 26,518 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

రాజకీయ ప్రవేశం
2014లో పుష్పశ్రీవాణి వైఎస్సార్‌సీపీ తరఫున కురుపాం నుంచి పోటీచేసి సమీప టీడీపీ అభ్యర్థి వి.టి.జనార్దన్‌ థాట్రాజ్‌పై 19,083 ఓట్లు మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2019లో టీడీపీ అభ్యర్థి నర్శింహప్రియ థాట్రాజ్‌పై 26,602 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు.
 

మరిన్ని వార్తలు