తాన అంటే ఎల్లో మీడియా తందాన అంటోంది

30 Nov, 2018 17:27 IST|Sakshi

కాకినాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాన అంటే ఎల్లో మీడియా తందాన అంటోందని వైఎస్‌ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాక్యానించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా  కాకినాడలో వంచనపై గర్జన దీక్షలో మాట్లాడుతూ...నాలుగేళ్లు చంద్రబాబు బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు కాంగ్రెస్‌తో జత కట్టారని తీవ్రంగా విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు వంచన చేస్తూనే ఉన్నారని అన్నారు. వైఎస్సార్‌ మరణం తర్వాత రాష్ట్రానికి చెడ్డ రోజులు మొదలయ్యాయని చెప్పారు.

దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఎదుగుతున్న రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని దుయ్యబట్టారు. తనకు ఏది అవసరమో చంద్రబాబు అదే చేస్తారు కానీ పేద ప్రజల పరిస్థితిని పట్టించుకోరని తెలిపారు. ప్రజలు గమనించకపోతే మళ్లీ మోసపోతామని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చంద్రబాబుకు రాజకీయ విలువలు లేవని, బీజేపీ, పవన్‌తో కలిసి అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీయే మిన్న అని పలుసార్లు చంద్రబాబు అన్న మాటలను గుర్తు చేశారు.

వైఎస్‌ జగన్‌కు వస్తోన్న ఆదరణ చూసి బాబు యూటర్న్‌ తీసుకున్నారని వెల్లడించారు. చంద్రబాబు వల్ల రాష్ట్రం అప్పులపాలైందని వ్యాక్యానించారు.  ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు పదవులను తృణప్రాయంగా త్యాగం చేశారని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యింటే ఈపాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

జగన్‌పై హత్యాయత్నానికి బాబు కుట్ర: వైవీ సుబ్బారెడ్డి

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వస్తోన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక జగన్‌ను అంతమొందించాలని బాబు కుట్ర పన్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వంచనపై గర్జన దీక్షలో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు.  ప్రతిరంగంలోనూ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, పోలవరం విషయంలో హామీలిచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనతో ఏపీ చాలా నష్టపోయింది.. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావించి వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని తెలిపారు.

 ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేశామని, పార్లమెంటు లోపల, బయటా కూడా పోరాటాలు చేశామని చెప్పారు.  ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి గుర్తు చేశారు. చివరకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షలు చేశామని వెల్లడించారు. హోదా వచ్చేవరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. జగన్‌కు వస్తోన్న ఆదరణ చూసి బాబు మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారని అన్నారు. ధర్మపోరాట దీక్ష పేరుతో బాబు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు డ్రామాకు తెరలేపారని వ్యాక్యానించారు.

మరిన్ని వార్తలు