న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తాం

27 Oct, 2018 04:40 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన పార్టీ నేతలు

ఘటనపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం:భూమన కరుణాకర్‌రెడ్డి

ఏపీ పోలీసుల దర్యాప్తు వద్దని.. తెలంగాణ పోలీసుల విచారణ కావాలని వ్యాఖ్యానించినట్లు తప్పుడు కథనాలు

ఘటనలో సీఎం, డీజీపీ పాత్రపై అనుమానాలు

వైఎస్సార్‌సీపీ ఉన్నత స్థాయి సమావేశం అనంతరం పార్టీ నేతల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో న్యాయం కోసం రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రి, గవర్నర్‌ను కలిసి నివేదిక ఇవ్వాలని నిర్ణయించామని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఘటనకు సంబంధించి తదుపరి చేపట్టాల్సిన వ్యూహంపై శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్‌ నేతలు సమావేశమై చర్చించారు. అనంతరం కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హత్యాయత్నంతో భుజానికి గాయం అయినప్పటికీ ప్రజలకోసం పాదయాత్ర చేయడానికి  జగన్‌ సిద్ధమయ్యారని.. అయితే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని పార్టీ నేతలంతా  విన్నవించనున్నట్లు తెలిపారు. వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. జాతీయస్థాయిలో  వైఎస్సార్‌సీపీపైన, తమ అధినేతపై బురద చల్లడమే  పనిగా..చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్తున్నారన్నారు. జగన్‌ కేసులో చంద్రబాబు ఏ1, డీజీపీ ఏ2 అన్నారు. డీజీపీ ఠాకూర్‌ మాట్లాడిన తీరును  ఖండిస్తున్నామన్నారు. సరైన విచారణ జరగాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారానే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం నియమించిన సిట్‌ కాకుండా వేరే ఏజెన్సీ ద్వారా విచారణ జరగాలని కోరారు.

తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి మాట్లాడుతూ కొన్ని టీవీ చానళ్లలో జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ పోలీసుల దర్యాప్తును వద్దని, తెలంగాణా పోలీసుల విచారణ కావాలని వ్యాఖ్యనించినట్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని.. అలాంటి వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌ దురుద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిట్‌ దర్యాప్తును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

లోకేష్‌ మాటలే డీజీపీ పలికారు..
మరో సీనియర్‌ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ మంత్రి లోకేష్‌ ట్విట్టర్‌లో వాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. 

విద్యార్థి దశ నుంచే చంద్రబాబుది నేరచరిత్ర
విద్యార్థి దశనుంచే చంద్రబాబుకు నేరచరిత్ర ఉందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు గతం, వర్తమానం రెండూ రక్తసిక్తమేనన్నారు. చదువుకునే రోజుల్లోనే ఎస్వీ యూనివర్సిటీలో కుల రాజకీయాలను పెంచిపోషించిన చంద్రబాబు.. నేడు రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడయ్యాడని దుయ్యబట్టారు. వంగవీటి రంగా, జర్నలిస్ట్‌ పింగళి దశరథరామ్‌ను హత్య చేయించడంలో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్‌ సెక్రటరీ రాఘవేంద్రరావును లారీతో తొక్కించి హత్య చేయించడంలోనూ ఆయన పాత్ర ఉందన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిని హత్య చేయించి, నిందితులకు ఆశ్రయం కల్పించి వారిని కాపాడారని ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు