‘మైనారిటీ ఓట్ల కోసం చంద్రబాబు తాపత్రయం’

3 Jan, 2019 19:00 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: తన రాజకీయ అవసరాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతారని వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ముస్లింల సమస్యలపై చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1999లో బీజేపీతో పొత్తు పొట్టుకున్న చంద్రబాబు.. 2004లో ఓడిపోయిన తర్వాత చారిత్రాత్మక తప్పిదం చేశానని చెప్పారని గుర్తుచేశారు. అయితే మళ్ళీ 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచి.. తాజాగా కాంగ్రెస్‌తో జత కట్టారని తెలిపారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీతో కలుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ మైనారిటీ ఓట్ల కోసం తాపత్రయ పడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ సునామీ సృష్టించనుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.

ముస్లిం సమస్యలపై వైఎస్సార్‌ సీపీ నేత, మాజీ ఐజీ ఇక్బాల్‌ మాట్లాడుతూ.. తమ సమస్యలపై చంద్రబాబును నిలదీసిన ముస్లిం యువకులపై కేసులు పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ముస్లింల స్థితిగతులపై జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా, సంచార్‌ కమిటీలు నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని తెలిపారు. మూడు నెలల కోసం ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు పొందడానికేనని ఆరోపించారు. ముస్లింకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత మహానేత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని గుర్తుచేశారు. తెలంగాణలో మాదిరే ఏపీ ప్రజలు కూడా చంద్రబాబు బుద్ది చెప్తారని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన కేసును ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఈ కేసును ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించడం లేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.  

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్‌ ఖాదర్‌ బాషా మాట్లాడుతూ.. మైనారిటీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లింలపై ప్రేమ పుడుతుందని విమర్శించారు. వైఎస్సార్‌  తరహాలోనే వైఎస్‌ జగన్‌ కూడా ముస్లింల సంక్షేమం కోసం పాటుపడతారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వైఎస్‌ జగన్‌కు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు