వైఎస్సార్‌సీపీతోనే రాప్తాడుకు స్వాతంత్య్రం

9 Mar, 2019 13:08 IST|Sakshi
పాపంపేటలో నిర్వహించిన ‘డ్వాక్రా ఢమరుకం’లో ప్రసంగిస్తున్న రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే రోజా, తదితరులు

మహిళల జీవితాలతో ఆడుకుంటున్న సునీత

పసుపు–కుంకుమ చెరిపేసిన ఆ కుటుంబానికి ఓటుతో బుద్ధి చెప్పండి

తోపుదుర్తి మహిళలు ఆదర్శంగా ఉద్యమించాలి

డ్వాక్రా రుణమాఫీ పేరిట మోసగించిన టీడీపీ

జగనన్నను ఆశీర్వదిస్తేనే మహిళల జీవితాల్లో వెలుగు

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా పిలుపు

అనంతపురం: ‘‘మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యుల రాక్షల పాలన నుంచి రాప్తాడు నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళపై ఉంది. వైఎస్సార్‌సీపీని గెలిపించుకుంటేనే ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వస్తుంది.’’ అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో శుక్రవారం రాప్తాడు నియోజకర్గ పరిధిలోని అనంతపురం రూరల్‌ మండలం పాపంపేటలో ‘డ్వాక్రా ఢమరుకం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా విభాగం నియోజకవర్గ కన్వీనర్‌ అపర్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన మహిళలను చూస్తుంటే ‘లేచింది.. నిద్రలేచింది.. మహిళా లోకం. దద్దరిల్లింది చంద్రబాబు ప్రభుత్వం’ అన్నట్లుందన్నారు. మంత్రి పరిటాల సునీత మహిళగా ఉండి మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న ఆమె స్త్రీ, శిశువుల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఆమె కుటుంబ సంక్షేమం మాత్రమే చూసుకుంటోందన్నారు.

టీడీపీకి ఓటు వేస్తే వడ్డీతో సహా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ అక్కచెల్లెమ్మలతో ఓట్లు వేయించుకుని ఇప్పటిదాకా రూపాయి కూడా మాఫీ చేయకపోవడంపై సునీత ఏమి జవాబు చెబుతారని ప్రశ్నించారు. పరిటాల కుటుంబం మహిళల జీవితాలు, వారి పసుపు కుంకుమలతో ఆడుకుంటున్నారనేది ఇక్కడికి వచ్చిన కొన్ని కుటుంబాలను చూస్తే అర్థమవుతోందన్నారు. మగవాళ్లను చంపి ఆ కుటుంబాలను దిక్కులేని వాళ్లను చేశారన్నారు. పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులు దోచుకోవడంతో పాటు అడ్డొచ్చిన వారిని దారుణంగా చంపిస్తున్నారన్నారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులతో కొట్టించిన మంత్రి సునీత మహిళ కాదా? అనిప్రశ్నించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా సునీత, ఆమె తనయుడు, కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారన్నారు. తోపుదుర్తిలో ఎలాగైతే మహిళలు మంత్రి సునీతకు నిలబెట్టి నీళ్తు తాపించారో.. నియోజకవర్గమంతా అదే రీతిన బుద్ధి చెప్పి ప్రకాష్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. రాప్తాడులో మరోమారు సునీతను గెలిపిస్తే ఆమె కొడుకు శ్రీరామ్‌ను మీ మీద రుద్దుతారని.. అలాంటి గన్నేరుపప్పు అవసరమా? అనేది మహిళలు నిర్ణయించుకోవాలన్నారు. సైకిల్‌కు ఓటు వేస్తే ఉగ్రవాదానికి ఓటేసినట్లేనన్నారు. ఫ్యానుకు ఓటేస్తే అభివృద్ధికి, ప్రత్యేకహోదాకు ఓటేసినట్లన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శైలజ చరణ్‌రెడ్డి, బోయ సుశీలమ్మ, శ్రీదేవి, అనంతపురం, హిందూపురం పార్లమెంటు జిల్లాల అధ్యక్షురాళ్లు గిరిజమ్మ, పార్వతమ్మ, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకురాళ్లు నయనత, అంజనాదేవి, ఉషారాణి, భానుకోట రాధమ్మ పాల్గొన్నారు.

క్షీర విప్లవం తీసుకొస్తాం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలతో సహకార డైరీలు ఏర్పాటు చేసి క్షీర విప్లవం తీసుకొస్తాం. తాను బతికున్నంత వరకు మహిళలకు అండగా ఉంటానన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి డ్వాక్రా మహిళలకు పెద్దపీట వేశారు. అప్పట్లో ఆయన రుణ విప్లవం తీసుకొచ్చారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత డ్వాక్రా మహిళలను మోసం చేశారు. వడ్డీతో సహా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గెలిచిన తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. రుణాలు మాఫీ చేయలేమంటూ మంత్రి పరిటాల సునీత స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీతో ఆర్నెల్ల పాటు మహిళలు రుణాలు చెల్లించలేదు. ఈ కారణంగా చాలా సంఘాలను బ్యాంకర్లు డిఫాల్టర్ల జాబితాలో చేర్చితే రూ.4–5 వడ్డీతో అప్పులు చేసి మరీ రుణాలు చెల్లించారు. ఇంతటి మోసం చేసిన చంద్రబాబు తీరా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పసుపు కుంకుమ పేరుతో మరోమారు మోసగించేందుకు వస్తున్నారు. రుణ మాఫీ హామీతో చేసిన మోసంపై ప్రతి ఒక్కరూ నిలదీయాలి. రాప్తాడు నియోజకవర్గంలో మండలానికో సామంతరాజును పెట్టి మంత్రి సునీత దోచుకుంటున్నారు. స్వచ్ఛభారత్‌ కింద 82 వేల మరుగుదొడ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే నిర్మంచకుండానే కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే గార్మెంట్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తాం. లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం.– తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి,రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త

మరిన్ని వార్తలు