సీఎం ఇంటి పక్కనే కృష్ణా నదిని పూడ్చి.. కబ్జా!

13 May, 2019 12:41 IST|Sakshi

కబ్జా చేసిన ప్రాంతాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు

కబ్జా వెనుక చంద్రబాబు, దేవినేని ఉమా హస్తం

చుక్కపల్లి ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలి

వైఎస్సార్‌సీపీ నేతల డిమాండ్‌

సాక్షి, అమరావతి : కృష్ణా నదిని పూడ్చి కబ్జా చేసిన ప్రాంతాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పరిశీలించారు. కృష్ణా నది గర్భంలో ఐల్యాండ్‌ నిర్మాణం కోసం.. ఇప్పటికే చాలాభాగం పూడ్చివేశారు. నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు ఇసుక బస్తాలతో కరకట్ట కూడా వేశారు. దీనిపై వారం క్రితం సాక్షిటీవీలో వరుస కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించారు. ఇసుక బస్తాలను తొలగించారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, మర్రి రాజశేఖర్, నందిగం సురేష్, మేరుగ నాగార్జున తదితరులు కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. టీడీపీ నేతలు రాజధాని పేరుతో ప్రభుత్వ భూములను, కొండలను, గుట్టలను కొట్టేశారని, ఇప్పుడు కృష్ణా నదిని కూడా వదలడం లేదని మండిపడ్డారు.

కృష్ణానదిని పూడ్చివేసి కబ్జా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఇళ్ల పక్కనే కృష్ణానదిని పూడ్చివేసి కబ్జా చేస్తుంటే.. వారికి ఇది తెలియడం లేదా? అని ప్రశ్నించారు. ఈ కబ్జా వ్యవహారం వెనుక చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌, దేవినేని ఉమ తదితరుల హస్తం ఉందని ఆరోపించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం కృష్ణానది పూడ్చి వేసిన ప్రాంతం ప్రభుత్వ భూమి అయినప్పటికీ.. ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఆ భూమి చుక్కపల్లి ప్రసాద్‌కు చెందిందని చెబుతున్నారని, కృష్ణా నది పూడ్చివేసి ఆక్రమించడానికి ప్రయత్నించిన చుక్కపల్లి ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో దేవినేని ఉమ, చంద్రబాబుపై కేసు నమోదు చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కృష్ణానది పూడ్చివేత, కబ్జాపై విచారణ చేపడతామని తెలిపారు. కృష్ణానది మధ్యలో కట్టడాలు చేపడుతుంటే సీఆర్‌డీఏ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు.

మరిన్ని వార్తలు