అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్‌ ప్రూఫ్‌ గోడ కట్టండి!

23 Jul, 2019 11:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రాద్ధాంతంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనదైన శైలిలో చురకలు అంటించారు. సభలో చంద్రబాబు కొద్దిగా స్పీడ్‌ పెంచారని, నిన్న టీడీపీ సభ్యులు పొడియం దగ్గరికి వెళితే.. ఈ రోజు వారు ఏకంగా సస్పెండ్‌ అయ్యేలా ప్రవర్తించారని అంబటి పేర్కొన్నారు. మంచి విషయం మీద పోరాటం చేస్తే.. మిమ్మల్ని అభినందిస్తామని, కానీ, ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న ఇష్యూయే లేదని స్పష్టం చేశారు. అంబటి మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు గోల చేయడం​తో.. ‘అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్‌ ఫ్రూప్‌ గోడ కట్టండి.. వినలేక సచ్చిపోతున్నాం’అంటూ ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి. ఆయన ఏమన్నారంటే..

సభ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నాం..!
‘నిన్న సభలో ఆర్థికమంత్రి ప్రకటన చేస్తే.. దానిపై క్లారిఫికేషన్‌ అడగకుండా ప్రతిపక్ష సభ్యులు గంటల తరబడి రాద్ధాంతం చేశారు. మీరు గతంలో  సభా సంప్రదాయాలను ఏ రకంగా పాటించారో ఒకసారి మననం చేసుకోండి. సభా సంప్రదాయాల విషయంలో మీ కన్నా మేం ఉదారంగా వ్యవహరిస్తున్నాం. 

మ్యానిఫెస్టోకు భిన్నంగా ఉంటే ప్రశ్నించండి..!
45 సంవత్సరాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్‌ ఇస్తామని మేం చెప్పినట్టు మీరు అంటున్నారు. 
మేం మా మ్యానిఫెస్టో చూపిస్తున్నాం. అందులోని అంశాలను చదివి వినిపించాం. మేం ఎక్కడైనా మ్యానిఫెస్టోకు భిన్నంగా వ్యవహరించి ఉంటే.. ప్రశ్నించండి. మా మ్యానిఫెస్టోలో చాలా  స్పష్టంగా చెప్పాం. ఏదొ ఒక పేపర్‌ కటింగ్‌ తీసుకొచ్చి ఇలా మాట్లాడటం ధర్మం కాదు. మ్యానిఫెస్టోలోని అంశాలను రెండుసార్లు టీవీలో ప్రదర్శించాక కూడా మాకు జస్టిస్‌ అంటూ నినాదాలు చేయడం సరికాదు. ఇది సభాసమయాన్ని వృథా చేయడమే. ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేసేందుకు ప్రతిపక్షం ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సభను అడ్డుకోవడాన్ని ప్రజలు హర్షించరు. సభ నాయకుడు మాట్లాడిన తర్వాత మీరు క్లారిఫికేషన్‌ అడిగి కూర్చోవాలి. అలా కాకుండా నేను మాజీ సీఎంను, గొప్పవాడిని అనుకుంటూ.. సభా నాయకుడికి ఎంత సమయం ఇచ్చారో.. అంత సమయం ఇవ్వాలని పట్టుబట్టడం సమంజసం కాదు. టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యేంతవరకు తెచ్చుకోవడమూ సరైంది కాదు. సభలో ప్రతిపక్ష సభ్యులకు కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తున్నాం. దానిని వారు దుర్వినియోగం చేస్తున్నారు. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తోడుగా ఉంటామని తాము మ్యానిఫెస్టోలో స్ఫష్టంగా చెప్పిన విషయాన్నిఈ సందర్భంగా అంబటి ఉటంకించారు. ఈ విషయంలో కాకమ్మ కబుర్లు చెప్పి సభా సమయాన్ని వృథా చేయరాదని ఆయన సభ్యులను కోరారు.

అమరావతిపై మీకు అంత ప్రేముంటే..
నిన్న మాజీ సీఎం అ‍మరావతి గురించి గంటల తరబడి మాట్లాడారు. సభా సమయాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం సరికాదు. మా నాయకుడు అమరావతిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. మీకు అంత ప్రేముంటే అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదు? అద్దె ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? మీ అబ్బాయికో అద్దె ఇల్లు ఎందుకు? అమరావతిలో స్థిర నివాసం ఏర్పరుచుకోవాలన్న చిత్తశుద్ధి లేకుండా అమరావతిని అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవడం ధర్మం కాదు. సభ కార్యక్రమాలకు ప్రతిపక్షం వారు సహకరించాలి. 

చదవండి: అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!
ఈర్ష్యా, ఆక్రోషంతోనే బాబు దిగజారుడు ప్రవర్తన!

మరిన్ని వార్తలు