భ్రమరావతిలోనూ స్థానికులకు ఉపాధి కల్పించలేదు

24 Jul, 2019 16:01 IST|Sakshi

స్థానికులకు 75శాతం ఉద్యోగాలు గొప్ప నిర్ణయం

అసెంబ్లీలో కీలక బిల్లుపై కొనసాగుతున్న చర్చ 

సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించడం చరిత్రాత్మకమని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఈ చట్టం అమల్లోకి రావడంతో గ్రామాల నుంచి ఉద్యోగాల కోసం వలసలు ఉండబోవని పేర్కొన్నారు. స్థానిక యువకులకు ఈ నిర్ణయంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే చట్టం తీసుకువస్తుంటే.. ఈ అంశం మీద ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. 

పరిశ్రమల కోసం భూములు కోల్పోతున్న స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే తప్పేంటో తమకు అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు గత 40 ఏళ్లలో చేయని పనులను వైఎస్‌ జగన్‌ 40రోజుల్లో చేశారని, నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణను ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. వచ్చే ఐదేళ్ల కోసం కాకుండా మూడు తరాలకు ఉపయోగపడేలా సీఎం వైఎస్‌ జగన్‌ తమ పార్టీ మేనిఫెస్టోను రూపొందించారని తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఏ రోజైనా తన మేనిఫెస్టోను ధైర్యంగా ప్రజలకు చూపించిందా? అని ఆయన ప్రశ్నించారు. 

దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని, పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. విశాఖ బ్రాండిక్స్‌ కంపెనీలో 98శాతం మంది స్థానికులు పనిచేస్తున్నారని, విశాఖ బ్రాండిక్స్‌ కంపెనీకి ఆద్యులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కిలారు రోశయ్య మాట్లాడుతూ.. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడం గొప్ప విషయమని, ఈ నిర్ణయంతో వైఎస్‌ జగన్‌ సామాజిక విప్లవాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధికి తొలి మెట్టు అని అభివర్ణించారు. చంద్రబాబు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని, గత ప్రభుత్వం స్వలాభం కోసం ప్రత్యేక హోదాను నీరుగార్చిందని విమర్శించారు. 

గతంలో అమరావతి పేరు చెప్పి.. భ్రమరావతిని చూపించారని, ఆ భ్రమరావతి నిర్మాణాల్లోనూ స్థానికులకు ఉపాధి కల్పించలేదని మండిపడ్డారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు అందరినీ మోసం చేశారని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే సీఎం వైఎస్‌ జగన్‌ గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు.

మరిన్ని వార్తలు