పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అవంతి ఘాటు వ్యాఖ్యలు

14 Sep, 2019 19:54 IST|Sakshi

సాక్షి, విశాఖ : జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌పై పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌ తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడవద్దని హితవు పలికారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ శనివారమిక్కడ మాట్లాడుతూ.. ‘పవన్‌ మీరంటే గౌరవం ఉంది. దయచేసి దాన్ని పోగొట్టుకోవద్దు. మీరు టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవి వినిపించారు. మీరు నవరత్నాలకు అనుకూలమో, వ్యతిరేకమో ముందు స్పష్టం చేయాలి. అమరావతి, పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పాం. మీరు దానికి అనుకూలమా, వ్యతిరేకమో చెప్పాలి. అయిదేళ్లలో మద్యపాన నిషేధాన్ని తప్పనిసరిగా అమలు చేస్తాం.

గతంలో మీరు మంగళగిరిలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను ఏమని విమర్శించారో మరిచిపోయారా?. గతంలో ఎన్నడూ లేనివిధంగా దళితులు, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం వైఫల్యమా?. మూడు నెలల్లోనే మేము ఇచ్చిన నాలుగు లక్షల ఉద్యోగాలకు మీరు వ్యతిరేకమా?. కొత్తగా పెట్టబోయే పరిశ్రమలలో 75 శాతం స్థానికులకు ఇవ్వాలని మా నిర్ణయంపై మీ జనసేన అనుకులమా, వ్యతిరేకమా?. టీడీపీ ట్రాప్‌లో పడొద్దు. మీకు ఓటేసిన గాజువాక ప్రజలని ఎన్నికల తర్వాత వచ్చి ఒక్కసారి అయినా కలిశారా?. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. వందకోట్లకు పైబడిన ప్రతి కాంట్రాక్ట్‌ జ్యుడిషియరీ పర్యవేక్షణ ఉండాలన్న మా ప్రతిపాదనకు మీరు అనుకులమా, వ్యతిరేకమా?. మూస ధోరణి రాజకీయ నాయకులులాగా మీరు మాట్లాడితే మీకే విలువ తగ్గుతుంది.’  అని హితవు పలికారు. 

పవన్‌కి పిచ్చి పీక్స్‌కు చేరినట్టుంది.. 
పవన్‌ కల్యాణ్‌పై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఘాటుగా స్పందించారు.  పవన్‌ పిచ్చి పీక్‌ స్టేజ్‌కు చేరిందంటూ మండిపడ్డారు. వైసీపీ వంద రోజుల పాలన చూస్తుంటే పారదర్శకత, దార్శనికత లోపించినట్లు కనిపిస్తోందని  పవన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శనివారం మంత్రి వెలంపల్లి విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ చంద్రబాబు మాటలు పవన్‌ కల్యాన్‌ నోట్లో నుంచి వస్తున్నాయి. జననేతగా ఎదుగుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లడం ఆకాశంపై ఉమ్మేయటమే అవుతుంది. టీడీపీతో లోపాయికారీ ఒప్పందం గుర్తించిన జనం పవన్‌ని రెండుచోట్ల ఓడించారు. ఎన్నికల్లో జనం తిరస్కరించినా బుద్ధి రాలేదు. వందరోజుల్లో ఎనభై శాతం పథకాలు అమలు చేయడం తప్పా?. వెనుకబడిన వర్గాలని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు యాభైశాతం రిజర్వేషన్‌ కల్పించడం తప్పా?. ఉగాదికి ఇరవై అయిదు లక్షల మంది పేదలకు గూడు కల్పించాలనుకోవడం సీఎం జగన్‌ చేసిన తప్పా?. పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది’ అంటూ సూచించారు.

చదవండి‘రియల్‌ హీరోను చూసి..సినీ హీరో ఓర్వలేకపోతున్నారు’

మరిన్ని వార్తలు