‘పార్క్‌ హయత్‌లో గడిపే తండ్రీ కొడుకులకు ఏం తెలుసు’

14 Nov, 2018 15:57 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నిప్పులు చెరిగారు. విపక్షాలతో చర్చించకుండానే భూసేకరణ-2018 చట్టం తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ చట్టం రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమని అన్నారు. స్వార్దంతోనే చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. రైతుల పొట్టగొట్టే జీవో 562ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు ముమ్మాటికీ రైతు వ్యతిరేకి అనే విషయం ఈ చట్టంతో స్పష్టమైందని అన్నారు. ‘తండ్రీ, కొడుకుల మాదిరి పార్క్‌ హయత్‌ హోటల్‌లో జల్సా చేసే వారికి రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయి’ అని బాబు, లోకేష్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రజల కష్టార్జితాన్ని ఇష్టారీతిన ఖర్చు పెడుతూ.. హోటల్‌ బిల్లులు చెల్లిస్తున్నారని దుయ్యబట్టారు. మరో నాలుగునెలల్లో బాబు గద్దె దిగక తప్పదని జోస్యం చెప్పారు. నాడు వ్యవసాయం లాభసాటి కాదని చెప్పిన చంద్రబాబు.. నేడు ఆ దిశగా రైతుల్ని బెదిరించీ, భయపెట్టి వ్యవసాయ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్రలు చేస్తున్నాడని రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కేంద్రం ఒప్పుకుంది కదా..!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి రాజధాని నిర్మించి ఇస్తామని కేంద్ర విభజన చట్టంలో పేర్కొందని రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. మరి అటువంటప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రైతుల దగ్గర నుంచి వేల ఎకరాలు ఎందుకు సేకరించాడని ప్రశ్నించారు. కేంద్రం భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలంటే గ్రామసభ ఆమోదం, రైతులతో చర్చలు, ఆహారభద్రత, రైతుకూలీల ఉపాధి వంటి వాటి గురించి స్పష్టమైన హామినివ్వాలి. కానీ, చంద్రబాబు తెచ్చిన దగాకోరు చట్టం వల్ల ఎవరి అభిప్రాయాలతో పనిలేకుంగానే భూములు సేకరించొచ్చని విమర్శించారు. ఇది రైతుల భూములు లాక్కోవాలనే దుర్మార్గమైన ఆలోచన తప్ప మరోటి కాదని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటీష్ వారు ఇలాంటి చట్టాలు తెచ్చారనీ, మళ్లీ బాబు పాలన ఆనాటి అరాచక పాలనను గుర్తుకు తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు