ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చంద్రబాబే..

25 Jan, 2020 17:08 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

సాక్షి, తాడేపల్లి: అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని.. ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అవసరమని భావించామని.. దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పారు. బీజేపీ నేత సునీల్ డియోదర్ రాజధాని అంశంపై బీజేపీతో చర్చించలేదని అంటున్నారని.. బీజేపీతో చర్చించామని మేము ఎప్పుడైనా చెప్పామా అని అంబటి ప్రశ్నించారు. తమ నిర్ణయంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మూడు రాజధానులు, హైకోర్టు ఏర్పాటుపై బీజేపీ నేతల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోకు బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేరా అని అంబటి ప్రశ్నిస్తూ.. బీజేపీ మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించారు.

హైకోర్టును శాశ్వతంగా సీమలోనే ఏర్పాటు చేస్తామని బీజేపీ చెప్పిందన్నారు. హైకోర్టుపై బీజేపీ కట్టుబడి ఉందో లేదో సమాధానం చెప్పాలన్నారు. ‘అమరావతి నిర్మాణం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలా సాగుతుందని చెప్పింది నిజం కాదా..? అధికారంలోకి రాగానే రాజధాని రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఆ హామీలు బీజేపీ నేతలకు గుర్తున్నాయా?’ అని అంబటి దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు బీజేపీ అండదండలు ఇంకా దేనికని.. చంద్రబాబుకు అనుకూలంగా బీజేపీ, జనసేన పనిచేస్తున్నాయని విమర్శించారు. 151 సీట్లు ఇచ్చి.. ప్రజలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని.. ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం తమ​‍కు ఉందన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందని పేర్కొన్నారు.

మూడు రాజధానులతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అని విశ్వసిస్తున్నామని.. చంద్రబాబు నిర్ణయాలను అమలు చేయాల్సిన అవసరం తమ లేదని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని ఎలా పాలించాలో తమకో అభివృద్ధి విధానం ఉందని వెల్లడించారు. విశాఖలో తాము భూ దందాలు చేస్తున్నామని పవన్‌ అంటున్నారని.. భూదందా చేసి పాలన సాగించాల్సిన దుస్థితి తమకు లేదన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా  అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

‘ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసింది చంద్రబాబు నాయుడే. ఫిరాయింపులను ప్రోత్సహించింది కూడా ఆయనే. తమ పార్టీలోకి రావాలంటే పదవికి రాజీనామా చేయాలని వైఎస్‌ జగన్‌ చెప్పారు.. కీలకమైన బిల్లు పై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు.. నిబంధనలకు విరుద్ధంగా గ్యాలరీలో కూర్చున్నారు.. ఛైర్మన్ పై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం’  అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు