చంద్రబాబు సంఘ విద్రోహ శక్తా?

20 Jan, 2020 17:43 IST|Sakshi

రాజధారి పేరిట పెద్ద భూకుంభకోణానికి పాల్పడ్డారు

అమరావతిలో అన్ని తాత్కాలిక నిర్మాణాలే

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు చరిత్రాత్మకం

అసెంబ్లీ  ప్రత్యేక సమావేశాల్లో అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక​ సమావేశాలు  ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నాయని, ప్రపంచంలోని తెలుగువారంతా ఈ ప్రత్యేక సమావేశాలను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై అంబటి మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మూడు ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ చరిత్రాత్మక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారని, ఈ బిల్లును రాష్ట్ర ప్రజలందరూ హర్షించాలని కోరారు.

‘ఐదేళ్ల క్రితం 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటైంది. అంతకుమునుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముందు కర్నూలు రాజధానిగా కొంతకాలం ఆంధ్ర రాష్ట్రం పరిపాలన కొనసాగింది. తెలుగువారంతా ఒకేప్రాంతంగా ఉండాలన్న భాషాప్రయోక్త రాష్ట్రాల భావనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను హైదరాబాద్‌  రాజధానిగా ఏర్పాటు చేశారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నాలుగు ప్రాంతాలను కలిపి ఉమ్మడి రాష్ట్రం కొనసాగింది. మన భాష ఒక్కటే.. యాసలు వేరు. సమైక్య ఉద్యమం జరిగినప్పుడు నందమూరి  తారకరామారావు ‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది’ అన్న పాటతో చైతన్యం కల్పించారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒక్కటే అని ఆనాడు నందమూరి చాటిచెప్పారు. కానీ ఆయన వారసులుగా చెప్పుకునేవారు, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు తుళ్లూరు నాది, మందడం నాది, ఉద్దండరాయపురం నాది.. అన్ని కలిసిన అమరావతి నాదే నాదే అంటున్నారు. విశాఖపట్నం నాది కాదు, కర్నూలు నాది కాదు, అమరావతి మాత్రమే నాది అనే సంకుచిత స్థాయికి చంద్రబాబు ఎందుకు దిగజారిపోయారు’ అని అంబటి మండిపడ్డారు. 

గతంలో తాను  శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ నాది.. హైదరాబాద్‌లోని ప్రతి అంగుళం నాది అనే భావనతో శాసనసభకు వెళ్లేవాడినని, కానీ పరిణామక్రమంలో హైదరాబాద్‌ ఏమైందో అందరికీ తెలుసునని అన్నారు. దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ ఏకైక మహానగరంగా హైదరాబాద్‌ ఎదిగిందని, మన హైదరాబాద్‌ బ్రహ్మాండంగా ఎదిగిందని మనమంతా గర్వించామని, కానీ, తెలంగాణ ఉద్యమం, సమైక్య ఉద్యమాలు జరిగి.. చివరకు హైదరాబాద్‌ నుంచి మెడ పట్టుకొని మనల్ని బయటకు గెంటారా? లేదా? అని ప్రశ్నించారు. ఈ మహానగరం మాదేనని తెలంగాణవారు తిరుగుబాటు చేశారని, రాజధాని ఏర్పాటు సంబంధించి ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. 

రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, రాజధాని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ప్రజలు ఆయనపై పెడితే.. ఆయన మాత్రం అసలైన అమరావతిని విస్మరించి.. అమరావతి పేరిట కృష్ణా జిల్లా వైపును ఎన్నుకున్నారని మండిపడ్డారు.  గుంటూరు జిల్లాలో ఉన్న అసలైన అమరావతిని నిర్లక్ష్యం చేసి.. ఆ పేరును వాడుకొని అటువైపు.. అమరావతిలో ల్యాండ్‌పూలింగ్‌ పేరిట చంద్రబాబు ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని మండిపడ్డారు. అమరావతి పేరిట చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయలేదా? అని ప్రశ్నించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా అమరావతిలో పెద్ద కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారని, రాజధాని విషయంలో ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేయలేదని, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు.. ఇలా అన్ని తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టారని గుర్తు చేశారు. 

బలహీనవర్గాలను దెబ్బతీసేందుకు రాజధాని విషయంలో చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని, ఆయన, టీడీపీ నేతలు బినామీ పేర్లతో అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపించారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో ఉండే సౌకర్యాన్ని వదిలిపెట్టి.. అర్ధంతరంగా చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టి దౌర్జన్యం చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతా? లేక సంఘవిద్రోహ శక్తా? అని ధ్వజమెత్తారు.

రాజధాని కోసం చంద్రబాబు పోరాటం చేయడం లేదని, కేవలం తన బినామీల కోసమే ఆయన పోరాటం చేస్తున్నారని అంబటి స్పష్టం చేశారు. అందరూ బాగుండాలనేవిధంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని, అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలనే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణ వల్ల చంద్రబాబుకు వచ్చే నష్టమేంటని అంబటి సూటిగా ప్రశ్నించారు. ఇలా అధికారాన్ని వికేంద్రీకరించడం వల్ల మళ్లీ ఎలాంటి ఉద్యమాలు రావు అని అన్నారు. నిజమైన రైతులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అన్యాయం చేయబోదని పేర్కొన్నారు. ఇప్పుడున్నవారంతా నిజమైన రైతులు కారని పేర్కొన్నారు. అమరావతి విషయంలో సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ ఒకే వాదన వినిపిస్తున్నారని, కానీ, రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కమలంలో పచ్చపుష్పాలు ఎక్కువయ్యాయని అంబటి ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణమంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలా మారిందని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు. చంద్రబాబునాయుడు మొదట ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియాన్ని వ్యతిరేకించారని, తర్వాత సమర్థించారని తెలిపారు. ఇప్పుడు విశాఖను వ్యతిరేకించిన వారు, తర్వాత సమర్థిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు అమరావతిపై ప్రేమ లేదని, కేవలం వారు కొనుక్కున్న భూములపైనే ప్రేమ ఉందని విమర్శించారు. అమరావతి రైతులకు ఎలాంటి సమస్యలున్నా చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు మాటలు విని ఎవరూ మోసపోవద్దని కోరారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా