ఆయనకు తల్లికి, చెల్లికి తేడా తెలియనట్లుంది

13 Jan, 2018 09:20 IST|Sakshi

సాక్షి, కడప : రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జవహర్‌కు తల్లికి, చెల్లికి తేడా తెలియనట్లుందని కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషా మండిపడ్డారు. వైఎస్సార్‌ జిల్లా కడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన నిన్న (శుక్రవారం) విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రను మంత్రి ముద్దుల యాత్రగా అభివర్ణించడంపై విరుచుకుపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే బీరును హెల్త్‌ డ్రింక్‌గా వర్ణించిన మంత్రి నుంచి ఇంతకంటే మాటలు ఊహించలేమన్నారు.

ఇలాంటి వ్యక్తి ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. అక్రమంగా, అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో రాష్ట్రంలో చంద్రబాబు కుటుంబం మినహా ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరన్నారు. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలు అర్జీలు ఇచ్చి ఇచ్చి విసిగిపోయారన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అనారోగ్య, అవినీతి, స్కాములు, క్షుద్ర, తాంత్రిక, సెక్స్‌ కాల్‌మనీ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని తూర్పారబట్టారు.

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి డిమాండ్‌ చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకపోతే సీఎం చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. 16 మాసాలుగా ఒక రాష్ట్ర సీఎంకు ప్రధానమంత్రి మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటే కారణం అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు