కోడెల నరసరావుపేట పరువు తీసేశారు...

20 Aug, 2019 18:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావుపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను కోడెల తన ఇంటికి తరలించడం సిగ్గు చేటు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ...‘ కోడెల వ్యవహారం కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోపెట్టినట్లు ఉంది. ఏకంగా అసెంబ్లీ ఫర్నీచర్‌ను దోచుకున్న ఘనుడు. అసెంబ్లీ ఫర్నిచర్‌ ప్రజల ఆస్తి, దాన్ని ఎలా తీసుకువెళతారు?. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచమైన పనులు చేశారు. అవసరం అయితే మేం చందాలు వేసుకొని కొనిస్తాం. కోడెల.. నరసరావుపేట నియోజకవర్గం పరువు తీసేశారు. 

చదవండి: చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల..!

నరసరావుపేట వాసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. కోడెల వల్ల నరసరావుపేట ఎమ్మెల్యేగా నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. ఇప్పటికే కే ట్యాక్స్‌ పేరుతో దారుణమైన అక్రమాలకు పాల్పడ్డారు. కోడెల కుమారుడు వెయ్యి బైక్‌లకు ట్యాక్స్‌ కట్టకుండా రిజిస్టర్‌ చేయడంతో అసలు విషయం బయటకి వచ్చింది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు లేఖ రాసినట్లు బుకాయిస్తున్నారు. తప్పుడు తేదీలతో హడావుడిగా లేఖ రాశారు. వందల ఏళ్ల నాటి వారసత్వ సంపదను షోరూంలో పెట్టుకున్నారు. అసెంబ్లీలో ఇంకా ఘోరమైన దోపిడీలకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే మందులు కూడా అమ్ముకున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఐ ఫోన్లు కూడా అమ్ముకున్నారు. అన్న క్యాంటీన్లలో భోజనాలు తన ఫార్మా కంపెనీ వర్కర‍్లకు అమ్ముకున్నారు. విచారణలో అన్నీ బయటకు వస్తాయి. అవినీతికి పాల్పడ్డ కోడెలపై చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ?. అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలింపుపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

చదవండి: కోడెల ఒప్పుకుంటే.. తప్పు ఒప్పవుతుందా?

మరిన్ని వార్తలు