టీడీపీ నేతలకు బుగ్గన సవాల్‌

19 Jun, 2018 14:39 IST|Sakshi

సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ టీడీపీ నేతలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తన హక్కులకు, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌లపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదును ఈ- మెయిల్‌ ద్వారా ప్రివిలేజ్‌ కమిటీకి పంపారు. ఈ సందర్బంగా బుగ్గన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని బీజేపీ నాయకులకు చేరవేస్తున్నారని తనపై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. పీఏసీ చైర్మన్ అయిన తనపై నిరాధార ఆరోపణలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. వైఎస్సార్‌ సీపీకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఏపీ భవన్‌లో లాగ్ బుక్ ట్యాపరింగ్ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తమపై బురద జల్లుతూ బీజేపీతో అంటకాగుతోంది టీడీపీనే అని విమర్శించారు. టీడీపీ అభియోగాలపై తేల్చుకునేందుకు తన పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని.. మరి టీడీపీ నేతలు సిద్ధంగా ఉంటే సవాల్ స్వీకరించాలన్నారు. 

మరిన్ని వార్తలు