చెప్పినట్లు చేయలేదనే ఈసీపై నిందారోపణలు: గరటయ్య

13 Apr, 2019 16:13 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి చెంచు గరటయ్య(పాత చిత్రం)

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను చెప్పినట్లు ఎన్నికల కమిషన్‌ పని చేయలేదనే అక్కసుతోనే ఈసీపై నిందారోపణలు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి బాచిన చెంచు గరటయ్య విమర్శించారు.  అమరావతిలో ఎన్నికల అధికారి మార్కండేయుల్ని శనివారం గరటయ్య కలిశారు. సంతమాగలూరు మండలంలో పోలింగ్‌ సిబ్బంది అండతో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. తంగేడుమల్లిలోని 56,57, అడవిపాలెంలోని 6,7, మక్కెనవారిపాలెంలోని 34, 43 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల అధికారులను విజ్ఞప్తి చేశారు. ఆరు పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కెమెరాలు తొలగించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై రౌడీయిజం చేసి బయటికి నెట్టేశారని ఆరోపించారు.

అధికార పార్టీతో స్థానిక అధికారులు చేతులు కలిపారని, ఈ విషయంపై ఫిర్యాదు చేసినా స్పందించలేదని చెప్పారు. ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తోన్న అభ్యర్థినని కూడా చూడకుండా తనను బూత్‌లోకి రాకుండా అడ్డుకున్నారని వాపోయారు. వీడియోలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. సీఈఓ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. జిల్లాల్లో చంద్రబాబుకు అనుకూలంగా పని చేసేవారిని నియమించుకుని అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.  

మరిన్ని వార్తలు