ఆస్తులు అమ్ముకుని ప్రజాసేవ చేస్తున్నా

16 Mar, 2019 14:46 IST|Sakshi
వైఎస్సార్‌సీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

సాక్షి, పొదలకూరు: ఆస్తులు అమ్ముకుని ప్రజాసేవ చేస్తున్నానని, రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారాలు చేసుకుని సంపాదించానని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం పట్టణంలోని కాకాణి రమణారెడ్డి నగర్‌కు చెందిన 48 కుటుంబాల వారు టీడీపీని వీడి ఎమ్మెల్యే కాకాణి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమిరెడ్డి తనను ధనవంతుడిగా చిత్రీకరించి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంపాదించినట్టుగా మాట్లాడుతున్నట్టు తెలిపారు.

అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌లో తాను సమర్పించిన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్, ఈ ఎన్నికల్లో సమర్పించబోయే అఫిడవిట్‌లో ఆస్తులను పరిశీలించాలని సూచించారు. ఏ మేరకు తన ఆస్తులు కరిగిపోయాయో తెలుస్తుందన్నారు. సోమిరెడ్డి మాదిరిగా తాను రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకుని ధనార్జన చేయడం లేదన్నారు. అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడుతూ రూ.కోట్ల ఆస్తులను కూడబెట్టినట్టు ఆరోపించారు.

ధన బలంతో తనపై విజయం సాధించాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు ఓటుకు ఎంత ఇచ్చినా తీసుకుని మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాల్సిందిగా సూచించారు. తాను కార్యకర్తల పట్ల వ్యవహరిస్తున్న తీరు, సమస్యలపై స్పందిస్తున్న విధానంతో తనకు కార్యకర్తలు దగ్గరవుతున్నారని తెలిపారు. మండలంలో కండలేరు ఎత్తిపోతల, ఎన్టీయార్‌ శుద్ధినీరు పథకాలు అమలు చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమైనట్టు విమర్శించారు. అవినీతికి పాల్పడడంతోనే ఇలాంటి పథకాలు నీరుగారిపోయినట్టు తెలిపారు. 

అంజాద్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరిక
పట్టణంలోని కాకాణి రమణారెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్న టీడీపీకి చెందిన 48 కుటుంబాల వారు మండల కో–ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌కే అంజాద్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాకాణి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన మహిళల్లో కొందరు మాట్లాడుతూ ఈనెల 13వతేదీ మంత్రి సోమిరెడ్డి సమక్షంలో తాము బలవంతంగా టీడీపీ కండువాలు వేసుకోవాల్సి వచ్చిందన్నారు.

తమ మనస్సుల్లో మాత్రం కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జగన్‌ ఉన్నారని, తాము వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతామని వెల్లడించారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. చిట్టేటి సుబ్బమ్మ, షేక్‌ యాస్మిర్, భోజనపు నాగమ్మ, బండి ఐశ్వరమ్మ, మద్దిలి భాగ్యమ్మ, అలుపూరు రాజేశ్వరి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీకోనం చినబ్రహ్మయ్య, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మహిళా విభాగం ఇన్‌చార్జి తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ సభ్యులు కండే సులోచన, ఎస్‌కే అంజాద్, నాయకులు వాకాటి శ్రీనివాసులురెడ్డి, మారు వెంకట్రామిరెడ్డి, ఎం.శేఖర్‌బాబు, పెదమల్లు శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు