నా జీవితం..ప్రజాసేవకే అంకితం

30 Mar, 2019 11:31 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి 

 అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడమే లక్ష్యం

‘సాక్షి’తో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి 

 ప్ర: రాజంపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు? మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు?

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి నేతృత్వంలో అత్యధికమెజార్టీ సాధించే గెలుపు దిశగా దూసుకుపోతున్నాను. వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తోడ్పాటుతోపాటు ప్రజల దీవెన ఉంది. అంతేగాకుండా జననేత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా నా విజయానికి కలిసివచ్చే అంశం.

ప్ర: రాజంపేటలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలపై, అలాగే ఇక్కడి ప్రజల మనోగతం ఎలా ఉంది?

మా నియోజకవర్గ ప్రజలు మహాతెలివైన వారు. రాజకీయచైతన్యం కలిగిన వారు. ప్రజలు ఇప్పటికే లోకల్‌ అయిన నావైపే మొగ్గుచూపుతున్నారు. నాన్‌లోకల్‌ లీడర్లు వస్తారు.. పోతారు. వారి గోగాకు, పుల్లకూర, ఉప్మా మాటలు రాజంపేట నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. 

ప్ర: రాజంపేట వాసులు ఫ్యాక్షన్‌ ప్రభావితం చేసే, కన్నింగ్, మాటల మాయగాళ్లను ప్రజలు నమ్ముతారా?

ఫ్యాక్షన్‌ ప్రభావితం చేసే వ్యక్తులను రాజంపేట ఓటర్లు దూరంపెడతారు. తొలివాగ్గేయకారుడు అన్నమయ్య నడిచిన నేల ఇది. అటువంటి ప్రాంతంలో ఉన్నవారు మంచిని, నిజాయితీని, ధర్మాన్ని ఆచరిస్తారు. కన్నింగ్, మాటలమాయగాళ్ల చేతిలో మోసపోయేందుకు ఇక్కడి ఓటర్లు సిద్ధంగాలేరు. 

ప్ర: రాజంపేటలో ఎన్నడూలేని రీతిలో ఈ ఎన్నికలో ఓ సామాజికవర్గం పాలిట్రిక్స్‌ జరుగుతున్నాయి. మైండ్‌గేమ్, క్యాస్ట్‌గేమ్‌ను ఎన్నడూలేని రీతిలో ఇప్పుడు జరుగుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వెలువడుతున్నాయి.దీనిపై మీ స్పందన?

నేను అందరివాడిని.. అందరిని ప్రేమగా, ఆప్యాయతగా పలుకురిస్తాను. సామాజికవర్గాల భేదాబిప్రాయాలు లేవు. మైండ్‌గేమ్, క్యాస్ట్‌గేమ్‌లకు నేను దూరం. ఏ కులమైనా.. ఏ మతమైనా అందరూ నావాళ్లే అనుకునే మనసత్త్వం నాది. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవాలనే భావనతో ప్రజాసేవ చేస్తున్నాను. కుట్రలు, కుతంత్రాలకు దూరం. మంచిని ప్రేమిస్తాను. ధర్మాన్ని ఆచరిస్తాను. 

ప్ర: ఇప్పటి వరకు మీ ప్రజాసేవ కొనసాగిందిలా..! భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళతారు?

ప్రజల సొమ్మును దోచుకునే స్వభావం లేదు. సొంత డబ్బులతో ప్రజాసేవచేస్తూ ముందుకెళుతున్నాను. అదే రీతిలో భవిష్యత్తులో ముందుకెళతాను. ప్రజల కోసం నిరంతరం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. ప్రజలే నా ఉపిరి, శ్వాస అనే భావనతో నడుచుకునేందుకు ఇష్టపడతాను.

 ప్ర: రాజంపేట అసెంబ్లీ జనానికి రైల్వేకోడూరులో అమలుకాబడిన దుర్మార్గపు రాజకీయశైలి భయం వెంటాడుతోందని భావనలు వెలువడుతున్నాయా? నిజమేనా?

నిజమే కదా? చందాలు వసూలు, సుంకాల చెల్లింపులు లాంటివి వస్తే ఇబ్బందిపడతామని వ్యాపారవర్గాలతోపాటు విభిన్న వర్గాలు భయాందోళన చెందతున్నారు. అందుకే కదా స్థానికుడు అయిన నాకే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. 

ప్ర: టీడీపీకి రాజంపేటలో అభ్యర్థులు కరువయ్యారనే ఆరోపణలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇందువల్లనే పక్క నియోజకవర్గనేతను బరిలోకి దింపారనే వాదన ఆపార్టీ వర్గాల్లోనే ఉంది. దీనికి మీరు ఏమంటారు?

వైఎస్సార్‌సీపీకి బలమైన ఆదరణ, అభిమానం కలిగి ఉన్న నియోజకవర్గం రాజంపేట. అటువంటి ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పోటీ చేసే నాయకుడు లేక, దిగుమతి చేసుకున్న నాయకున్ని ఎన్నికల బరిలోకి దింపిందనే విషయం అందరికీ తెలిసిందే కదా.

 ప్ర: ఎన్నికల వేళలో చాలామంది క్షత్రియ సామాజికవర్గంతోపాటు ఇతర సామాజికవర్గాలకు చెందిన అధికారులను ఆకస్మికబదిలీ చేయించారనే వాదన రాజంపేటలో వినిపిస్తోంది.       నిజమేనా?

ఎక్కడ ఓడిపోతామనే భావనతో అధికారపార్టీ మాకు వ్యతిరేక సామాజికవర్గాలకు చెందిన అధికారులను ఆకస్మికంగా బదిలీ చేయిస్తున్నారు. వేధింపులకు గురిచేస్తున్నారు. ఇది నిజం. ఇప్పుడు ఎన్నికలసంఘం నేతృత్వంలో అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్ర: చంద్రబాబు పాలనపై జనంలో వ్యతిరేకత వెల్లుబుకుతోంది. 650 హామీలు ఇచ్చి నట్టేట ముంచేశారని జనం బహిర్గతంగానే విమర్శిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం?

బాబు పాలన దోపిడీ, అవినీతితో కూడుకున్నదని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. 

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రాజంపేటను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే యోచన ఉంది?
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం తథ్యం. జగన్‌ సీఎం అయితే అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతారు. నేను రాజంపేట నియోజకవర్గంలో దివంగత సీఎం వైఎస్సార్‌ను ఆశయంగా తీసుకొని శాశ్వత అభివృద్ధికి దోహదపడతాను.

 మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది?
మాది నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లె. నేను దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో నందలూరు సింగల్‌విండో చైర్మన్‌ ఎన్నికతో రాజకీయ ప్రవేశం చేశాను. ఆనాటి నుంచి మా కుటుంబానికి వైఎస్సార్‌ కుటుంబం అంటే ఎనలేని అభిమానం, ప్రేమ. దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రతిపక్షనేతగా ఉన్న హయాంలో బస్సు యాత్రకు మా ఇంటికి వచ్చారు. ఇప్పటికీ ఆయన రాజకీయశైలిని మరిచిపోలేకున్నాను. ఆయన ఆశయాలకు పాటుపడుతూ, జగన్‌ అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళుతున్నాను.

 మీ ప్రచారం ఎలా జరుగుతోంది? వైఎస్సార్‌సీపీ వస్తున్న జనాదరణ ఏలా ఉంది? 
ఆరుమండలాల్లో ప్రచారానికి జనంనుంచి విశేషస్పందన లభిస్తోంది. నాయకుల నేతృత్వంలో పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నాయి. బాబు సామాజికవర్గంతోపాటు, కాపు, క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారు వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గుచూపుతున్నారు. ఏగ్రామానికి వెళ్లినా జనం అపూర్వస్వాగతం, ఆపాయ్యతలు, అభిమానాలు చూపుతున్నారు. 

మరిన్ని వార్తలు