‘సంతాప సభను.. బాబు రాజకీయ సభగా మార్చారు’

1 Oct, 2019 13:12 IST|Sakshi

సాక్షి, గుంటూరు: కోడెల శివప్రసాదరావు సంతాప సభను రాజకీయ సభగా మార్చిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆత్మహత్యకు చంద్రబాబు, కోడెల పిల్లలే కారణమంటూ ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశంలో చంద్రబాబుపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల ఆసుపత్రిలో ఉన్నప్పుడు చంద్రబాబు వెళ్లి పలకరించలేదని గుర్తుచేశారు. ఒకవేళ పలకరించి ఉంటే చనిపోయేవారు కాదని వ్యాఖ్యానించారు. 

కోడెల కుటుంబంపై ప్రేమ ఉంటే ఆయన కూతురు, కొడుక్కి నియోజకవర్గ ఇంఛార్జ్‌ పదవులను ఇవ్వాల్సింది కదా? ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నించారు. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు చులకన చేసి మాట్లాడుతున్నారని, ఆయనకు వయస్సు పెరిగేకొద్దీ చాదస్తం ఎక్కువైందని దుయ్యబట్టారు. ఇప్పటివరకు చంద్రబాబు చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను ప్రివిలైజేషన్‌ కమిటీకి తీసుకెళ్తామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు