ఎల్లో మీడియా కుట్రలు ఏమీ చేయలేవు..

22 Sep, 2019 18:24 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసే హక్కు చంద్రబాబుకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన వార్తలను పట్టుకుని చంద్రబాబు...సీఎంకు లేఖ రాయడం సమంజసంగా ఉందా అని సూటిగా ప్రశ్నించారు.  ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆదివారం  మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాలు నిర్వహించాం. ఫలితాలు విడుదలైన తర్వాత ఎవరైనా పేపర్‌ లీకైందని రాస్తారా? చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణ ఆధారాలను ప్రజల ముందు ఉండాలి. లేదంటే బాబు, రాధాకృష్ణలపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి. 

14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేశారా? బలహీన వర్గాలకు ఉద్యోగాలు వస్తే చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నారు?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. సీఎం జగన్‌...బడుగు, బలహీన వర్గాల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నారు. ఎల్లో మీడియా కుట్రలు ఆయనను ఏమీ చేయలేవు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల జేజేలు పలుకుతున్నారు. పచ్చ పత్రికలు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు. ఇప్పటికైనా రాధాకృష్ణ తప్పుడు కథనాలపై సమాధానం చెప్పాలి, లేకుంటే చట్టపరంగా ముందుకు వెళతాం. చంద్రబాబుకు దమ్ముంటే ఆయన హయాంలో ఉద్యోగాల భర్తీపై చర్చకు రావాలి.’ అని సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు