రాష్ట్రానికి ఆయనో ఎల్లో వైరస్‌: అమర్నాథ్‌

4 Jul, 2020 11:15 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రతిపక్షం అడ్డుపడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. చంద్రబాబు స్టేట్ కోసం కాకుండా రియల్ ఎస్టేట్‌ కోసం ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలని చూస్తున్నారని తెలిపారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని అమర్నాథ్‌ గుర్తు చేశారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ చేశారని ప్రజలు దానిని గ్రహించారని అన్నారు. చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ తొత్తుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర టీడీపీ, సీపీఐ నేతలు విశాఖ అభివృద్ధికి అడ్డుపడటంపై ఆలోచించాలని కోరారు.

రాయలసీమ ప్రజలకు కూడా చంద్రబాబు అన్యాయం చేశారని చెప్పారు. సొంత జిల్లా చిత్తూరులోనే చంద్రబాబు నమ్మకం కోల్పోయారని ఎమ్మెల్యే అమర్నాథ్‌ పేర్కొన్నారు. కనీసం కృష్ణా, గుంటూరులో అయినా ప్రాతినిధ్యం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి.. చంద్రబాబు, లోకేష్‌ సమయం దొరకలేదా? అని అన్నారు. చంద్రబాబు కుట్రలను ఉత్తరాంధ్ర ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన ఎల్లో వైరస్ అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. విశాఖ పరిపాలన రాజధాని రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
(చదవండి: అన్న కోసమే.. మోకా హత్య !)

మరిన్ని వార్తలు