ఆ విరాళాలపై చంద్రబాబు విచారణకు సిద్ధమా?

6 May, 2020 18:20 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ 

సాక్షి, తాడేపల్లి : మద్యం దుకాణాలపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన చంద్రబాబుకు మద్యం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  హుద్‌ హుద్‌ తుపాన్‌ పేరుతో చంద్రబాబు, టీడీపీ నేతలు సేకరించిన నిధులకు ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేదని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర‍్ల నుంచి కోట్ల రూపాయల నిధులు సేకరించి మింగేశారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే హుద్‌ హుద్‌ విరాళాలపై విచారణకు రావాలని సవాల్‌ విసిరారు. పేదల పేరుతో వందల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. (చదవండి : ‘ఆ విషయంలో పచ్చ బ్యాచ్‌ ఎందుకు స్పందించలేదు?’)

మద్యం షాపులపై అయన్న పాత్రుడు మాట్లాడే భాష చూస్తుంటే అసహ్యం వేస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో 43 వేల బెల్ట్ షాప్ లు పెట్టినప్పుడు అయ్యన్నపాత్రుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారినప్పుడు ఎందుకు అయ్యన్న ప్రశ్నించలేదని నిలదీశారు. సీఎం జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 43వేల బెల్టు షాపులు తొలగించారని గుర్తుచేశారు. ఏపీలో బెల్టు షాపులు లేకుండా చేశామన్నారు.  ప్రజలు మద్యానికి దూరమవుతారనే ధరలు పెంచామన్నారు. మద్యం రేట్లు పెంచితే తప్పేంటని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు