విచారణలు అంటే బాబుకు భయం: కాకాణి

4 Dec, 2018 12:48 IST|Sakshi
కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

నెల్లూరు : సీబీఐ విచారణలు అంటే ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి భయమని, అందుకే తన అవినీతి బయటపడుతుందనే సీబీఐని రాష్ట్రంలోనికి రానివ్వకుండా జీవో విడుదల చేసి అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి విమర్శించారు. నెల్లూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కాకాణి విలేకరులతో మాట్లాడుతూ.. ఇద్దరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు టీడీపీ ప్రభుత్వ అవినీతిపై చేసిన ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అవినీతి పరులంతా కాంగ్రెస్‌ చేరతారని 2013లో చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఆయన దేశంలోనే నెంబర్‌వన్‌ అవినీతిపరుడు కావడంతోనే కాంగ్రెస్‌ చేరారని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు అందరిపై సీబీఐ విచారణ కోరిన చంద్రబాబు ఇప్పుడు తన బండారం బయటపడుతుందనే సీబీఐనే విమర్శిస్తున్నారని అన్నారు. అవినీతిపై పదేపదే మాట్లాడే పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కల్లాం చేసిన ఆరోపణలపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన కార్యదర్శులు చేసిన ఆరోపణలపై సోమిరెడ్డి లాంటి వాళ్ల చేత వివరణ ఇప్పించి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలన్నింటిపైన పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు