వ్యవసాయాన్ని పండగ చేస్తానన్నారు.. కానీ మర్చిపోయారు

15 Feb, 2019 12:45 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

సాక్షి, నెల్లూరు: చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని పండగ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రైతులను పూర్తిగా మరిచిపోయారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతులకు పూర్తి రుణమాఫీ అని చెప్పి నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని ఆరోపించారు. రైతులు ఆగ్రహం ఉండటంతో ఇప్పుడు అన్నదాత సుఖీభవ పేరుతో నాలుగు వేలు ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అన్ని విధాల నష్టపోయిన రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోలేదని గోవర్ధన్‌ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటివరకు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రైతులే చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే వైఎస్సార్‌ సీపీ పథకాలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు. పసుపు కుంకుమ పేరుతో మహిళలను మరోసారి మోసం చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు