ఆ పత్రికది విష ప్రచారం

24 Sep, 2019 11:44 IST|Sakshi

సాక్షి, కడప(బనగానపల్లె) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమర్థ పాలనపై ఆంధ్రజ్యోతి పత్రిక విష ప్రచారం చేస్తోందని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ కడుపు మంటతో ప్రభుత్వంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. పట్టణంలోని స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల్లో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. పారదర్శక పాలనలో భాగంగా గ్రామ వలంటీర్ల నియామకంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించినది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని తప్పుడు కథనాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. చంద్రబాబు కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నారని విమర్శించారు. గతంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయగా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇతర రాష్ట్రాల్లోని 150 సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రిలోనూ పేదలు వైద్యం పొందేలా చర్యలు తీసుకున్నారన్నారు. అక్టోబర్‌ 15 నుంచి వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 ప్రకారం బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతుందన్నారు. ప్రజాసంకల్ప యాత్ర లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల మేరకు నాయీ బ్రాహ్మణు లు, టైలర్లు, రజకులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో రూ .10 వేలు ఆర్థికసాయం అందుతుందన్నారు. ఉగాది రోజున అర్హులైన 25 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాల పంపిణీకి శరవేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందించే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు.  

 

మరిన్ని వార్తలు