రాబోయే రోజుల్లో 76 జీవో అమలు చేస్తాం: కోన

4 Dec, 2018 16:59 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి

హైదరాబాద్‌: విశాఖపట్నంలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారిస్తామని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి గుర్తు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కోన విలేకరులతో మాట్లాడుతూ..ఆర్ధికంగా చితికిపోయిన బ్రాహ్మణులను ఆదుకోవాలనే సంకల్పంతో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను రూ. వెయ్యి కోట్లతో ఏర్పాటు చేయాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కానీ చంద్రబాబు ఐదేళ్లకు గానూ రూ.205 కోట్లు మాత్రమే కేటాయించి ఇప్పటి వరకు రూ.170 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఐవైఆర్‌ కృష్ణా రావుని అవమానించిందని గుర్తు చేశారు. అలాగే టీటీడీ మాజీ అర్చకులు రమణ దీక్షితుల్ని అవమానించి ఆయనకు అన్యాయం చేసిందని విమర్శించారు.

బ్రాహ్మణ ద్వేషంతో చంద్రబాబు ఉన్నారని, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా బ్రాహ్మణులకు కేటాయించలేదని తెలిపారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేయవద్దని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అర్చకుల సమస్యలు చంద్రబాబుకు పట్టవన్నారు. జాతీయ భావనే చంద్రబాబుకు లేదని, రాబోయే రోజుల్లో 76 జీవో అమలు చేస్తామని చెప్పారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బ్రాహ్మణుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి మల్లాది విష్ణుతో కలిసి అన్ని జిల్లాల్లో పర్యటించి సమస్యలు అధ్యయనం చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు