‘కిరణ్‌ తప్పుడు దారిలో సీఎం అయ్యాడు’

13 Jul, 2018 16:05 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రదారుడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్‌ తప్పుడు దారిలో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం వల్లే ప్రభుత్వాన్ని నడిపారని వివరించారు. టీడీపీతో కలిసి నడవకపోయినా రాబోయే కాలంలో మద్దతు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. కిరణ్‌ సోదరుడు టీడీపీ తరపున పోటీ చేస్తే కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఖర్చు పెట్టకుండా చెప్పుల పార్టీ పెట్టాడని, పీలేరు నుంచి కూడా ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఏకాకిగా దొంగ చాటుగా కండువా వేసుకున్న వ్యక్తులు తమ జిల్లాలో పుట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ స్థాపించిన రోజున కాంగ్రెస్ చచ్చిపోయిందని, ఇపుడు ఆ పార్టీలో ద్రోహులు మాత్రమే ఉన్నారన్నారు. 

మరోవైపు చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. చంద్రబాబు అవినీతి సొమ్మును కూడబెట్టెందుకే పాటుపడుతున్నారని ఆరోపించారు. దోచుకున్నది దాచుకునేందుకే చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. నాడు స్టీల్‌ ఫ్యాక్టరీ గురించి పట్టించుకోకుండా ఇపుడు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.

 

మరిన్ని వార్తలు