రాజధానితో చంద్రబాబు వ్యాపారం

5 Feb, 2020 11:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: రైతు కూలీల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు.. కౌలు పరిహారాన్ని పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు రాజధాని ప్రాంత రైతు కూలీలు, రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలసి బయటకు వచ్చిన అనంతరం రాజధాని రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని విమర్శించారు.  అక్రమంగా కేసులు బనాయించారని ఆరోపించారు. బాబు చేసిన అన్యాయాలపై సీఎం వద్ద రైతులు ఎకరువు పెట్టారని ఆర్కే తెలిపారు. కాగా, భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ వారం రోజుల్లో ప్రకటన ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.

రిజర్వ్‌ జోన్లను ఎత్తివేసేందుకు కూడా  హామీ ఇచ్చారని.. రైతులు హాయిగా పంటలు పండించుకోవచ్చని.. రాజధాని ప్రాంతానికి ప్రభుత్వరంగ సంస్థలకు తీసుకొస్తామని కూడా సీఎం చెప్పారని ఆర్కే వివరించారు. మూడు నెలల్లోనే మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తామని మాటిచ్చారని.. మంగళగిరి ప్రాంతంలో ఉన్న ఆరు ఎత్తిపోతల పథకాలను, పైప్‌లైన్‌ పనులకూ నిధులు విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు. సుమారు రూ.8 కోట్లు విడుదల చేసేందుకు సీఎం సంతకాలు చేశారన్నారు.  రైతులు మాట్లాడుతూ, అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దని అభివృద్ధే ముద్దు అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించామని చెప్పారు. అనేక పంటలు పండే భూముల్లో రాజధాని వద్దని చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదని చెప్పామన్నారు.

>
మరిన్ని వార్తలు