చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదు: ఆర్కే

29 Dec, 2019 14:02 IST|Sakshi

సాక్షి, గుంటూరు : రాజధానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ పరిస్థితికి కారణం చంద్రబాబు నాయుడు దోపిడీనే అని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే ఆర్కే ఆదివారమిక్కడ మాట్లాడుతూ...‘చంద్రబాబు చేసిన పాపం ఇప్పుడు రాజధాని రైతులు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధానిలో చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. భూములు ఇచ్చిన రైతులకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. దోపిడీయే లక్ష్యంగా చంద్రబాబు పనిచేశారు. అన్నివిధాలుగా రాజధాని రైతులను చంద్రబాబు మోసం చేశారు. 

ఇవాళ రైతుల గురించి ఆయన మాట్లాడటం దారుణం.  రాజధాని లో జరిగిన కుంభకోణాలు ప్రభుత్వం బయట పెడుతుంటే చంద్రబాబు  కంగారు పడుతున్నారు. చంద్రబాబు అనుకూల మీడియాతో పాటు  ఆయనకు అనుకూలంగా ఉన్న కొంతమంది రియల్టర్లు ఆయన బినామీల రాజధానిలో హంగామా చేస్తున్నారు. దీక్షలు చేయడానికి రైతులు రాకపోతే చంద్రబాబు కార్యకర్తలు పంపించి చేయిస్తున్నారు.  రాజధాని పేరుతో తమను ఎందుకు మోసం చేశారని దీక్షలు చేసే రైతులు చంద్రబాబును నిలదీయాలి.


 
రాజధానిపై సీఎం ప్రకటన, జీఎన్‌ రావు కమిటీ నివేదికపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. కుటిల రాజకీయాలు చేసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రాజధాని రైతులకు చంద్రబాబు చేయలేని పనులను సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలు ఇస్తోంది. రైతు కూలీలకు ప్రతి నెలా పెన్షన్‌ ఇస్తున్నాం. ప్రభుత్వం రైతులందరికి న్యాయం చేస్తుంది.’ అని అన్నారు.

మరిన్ని వార్తలు