లోకేష్‌ మామూలు పప్పు కాదు: రోజా ధ్వజం

28 Jun, 2018 14:25 IST|Sakshi
మీడియాతో ఎమ్మెల్యే ఆర్కే రోజా

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మకమైన ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాధరణను చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్‌ నిజంగానే పప్పు అని మరోసారి రుజువైందన్నారు. కంపెనీలు తెచ్చామని లోకేష్‌ గొప్పలు చెబుతున్నారనీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వాటిని కూడా తమ ఖాతాలో వేసుకున్న లోకేష్‌ను పప్పు అని కాకుండా ఇంకేమని పిలవాలంటూ ఆమె మండిపడ్డారు. పప్పు అంటే ఇన్నిరోజులు విటమిన్‌ ఉన్న పప్పు అనుకున్నారు, కానీ అది గన్నేరు పప్పు అని ఏపీ సీఎం చంద్రబాబు త్వరలోనే తెలుసుకుంటారని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. గత నాలుగేళ్లలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సుల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని మీరు గొప్పలు చెబితే పచ్చ పత్రికలు అదే విషయాన్ని రాశాయి. కానీ కేవలం 16,900 కోట్ల రూపాయాల పెట్టుబడులు వచ్చాయని నివేదికల్లో తేలిందన్నారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీకి వస్తే ఆయన కాళ్లు పట్టుకోవడానికే మంత్రి దేవినేమి ఉమాను చంద్రబాబు పంపారు. గతంలో ఆడా.. మగా ఎవరు అని దేవినేనిని కేసీఆర్‌ ప్రశ్నించారు. కళా వెంకట్రావు లేఖలో ప్రతి లైన్‌కు వివరణ ఇస్తాం. టీటీడీని భ్రష్టు పట్టించింది చంద్రబాబు. సంబంధం లేని వ్యక్తులను టీటీడీలో చేర్చి శ్రీవారి ఆగ్రహానికి గురైంది చంద్రబాబే. సంబంధం లేని వాళ్లను టీటీడీలో సభ్యులుగా చేశారు. పొరుగురాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డులో సభ్యురాలిని చేశారు. 

నాలుగేళ్లుగా బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేసింది టీడీపీనే. ఏ రోజూ మేం బీజేపీతో కలవలేదు.. కలుస్తామని చెప్పలేదు. అమిత్‌ షా వస్తే రమణ దీక్షితులు వెళ్లారని ఆయనను ప్రధాన అర్చకులు పదవి నుంచి తొలగించారు. అవినీతి అంటూ ఇంకా పాతపాటే పాడుతున్నారు. కానీ, నాలుగేళ్లు కేంద్రలోని బీజేపీతో అంటకాగిన చంద్రబాబు.. ఎందుకు ఆధారాలు చూపించలేక పోయారు ?. లక్షకోట్ల ఆస్తి ఉందని నిరూపించాలని, కేవలం తనకు 10శాతం ఆస్తి ఇస్తే చాలని వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలోనే సవాల్‌ విసిరారు. తమ ఆరోపణల్లో వాస్తవం లేదని టీడీపీ నేతలే పరోక్షంగా అంగీకరించారు.

వ్యవసాయంపై చంద్రబాబు చిన్నచూపు
కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఏరువాక చేస్తున్న చంద్రబాబుపై రైతులు పోరువాక చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్న వ్యక్తి నేడు ఏరువాక కార్యక్రమాల్లో పాల్గొన్నా చంద్రబాబును ఎవరు నమ్మరు. రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. రైతులకు రూ.87వేల కోట్లు బాకీపడ్డ చంద్రబాబు బాండ్లు అంటూ వాళ్లను మభ్యపెట్టే యత్నం చేశారు. ఆ బాండ్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు. 

బాబు హయాం అంటే మహిళలపై వేధింపులే..
సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే.. 2014లో మహిళలపై వేధింపులలో దేశంలో ఏపీ9వ స్థానంలో ఉంటే.. నేడు ఏపీ 4వ స్థానానికి వచ్చిందంటే చంద్రబాబు ఎంత గొప్పగా పాలిస్తున్నారో తెలుస్తుంది. పచ్చ దొంగలు అమరావతిని భ్రష్టుపట్టించినట్లే షికాగోలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టేందుకు వెనుకాడటం లేదు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కేసులో తాను పోరాడితే.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలను రక్షించుకునేందుకు మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా ఏడాదిపాటు నిషేధించడాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారు. టీడీపీ నేత సజ్జా బుజ్జి గౌతమి అనే యువతిని నమ్మించి పెళ్లిచేసుకుని ఆపై హత్యచేశాడు. గౌతమి చెల్లెలు పావని పోరాటంతో టీడీపీ నేతలే హంతకులు అని, వారి హస్తం ఉందని తేలింది. ఎమ్మార్వో వనజాక్షి ఇసుక మాఫియాను అడ్డుకున్నప్పుడు ఆమెపై టీడీపీ నేత చింతమనేని దాష్టీకానికి పాల్పడగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యేవి కావు.

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పెట్టి అమ్మాయిలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి తల్లిదండ్రులు కోరితే టీడీపీ నేతల రంగు బయటపడుతుందని అందుకు చంద్రబాబు వెనుకంజ వేశారు. నారాయణ కాలేజీల్లో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, వేధింపులపై కేసులు ఉండవు. తాజాగా టీడీపీ సర్పంచ్‌ హరిణికుమారిని ఆమె భర్త, టీడీపీ యూత్‌ లీడర్‌ భీమవరపు యతేంద్ర రామకృష్ణ చిత్ర హింసలు పెట్టినా కేసులపై విచారణ జరపరు. ప్రభుత్వం టీడీపీది అయినప్పుడు పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని చెప్పడం సమంజసం కాదన్నారు. మదమెక్కి టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. మద్యం తాగిస్తూ రాష్ట్రాన్ని మరింత వెనక్కి తీసుకెళ్తున్నారు. ఏపీలో మహిళలపై దౌర్జన్యాలు, వేధింపులు ఏడాదికి 9.4 శాతం పెరుగుతుందంటే.. వ్యవసాయంలో కానీ, పరిశ్రమల ఏర్పాటుల్లో మాత్రం అభివృద్ధి లేనందుకు సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి.

సీఎం రమేష్‌కు స్టీల్‌ప్లాంట్‌ ఇప్పుడు గుర్తుకొచ్చిందా‌..
మనకు రావాల్సింది ఏదీ రాకపోయినా.. కేంద్రంలో టీడీపీ ఎంపీలు, రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పటికిప్పుడు కడపకు ఏదో అన్యాయం జరిగిందంటూ టీడీపీ నేత సీఎం రమేష్‌ దొంగ దీక్షలు చేస్తున్నారు. కానీ 1995-2004 మధ్య కాలంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు స్టీల్‌ప్లాంట్‌ ఎందుకు గుర్తుకు రాలేదు. ఆపై దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్‌ స్టీల్‌ప్లాంట్‌ దిశగా అడుగులు వేయగా అడ్డుకుంది టీడీపీ నేతలే అని ఏపీ ప్రజలకు తెలుసు. ఆపై 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్లాంట్‌ ఏర్పాటు వివరాలు 6 నెలల్లో ఇవ్వాలని కోరగా.. అక్కడ స్టీల్‌ప్లాంట్‌కు అవకాశమే లేదని చెప్పుకుంటూ టీడీపీ నేతలు తగిన రిపోర్టులు సమర్పించలేదని ఆర్కే రోజా విమర్శించారు.

హోదా కోసం టీడీపీ ఎంపీలు ఏం చేశారు ?
బీజేపీతో లాలుచీ పడి వైఎస్సార్‌సీపీపై నిందలు వేస్తున్నారు. నాలుగేళ్లుగా విభజన హామీలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం, ఏపీ అభివృద్ధి కోసం రాజీనామా చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేతల్లో చిత్తశుద్ధి లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారని ఈ సందర్భంగా రోజా గుర్తుచేశారు. విభజన హామీల కోసం టీడీపీ నేతలు ఏ రోజూ పోరాడలేదన్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు