లింగమనేని ఎక్కడున్నారు? : ఆర్కే

30 Jun, 2019 16:08 IST|Sakshi

సాక్షి, అమరావతి : నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గెస్ట్‌ హౌస్‌కు నోటీసులు ఇస్తే లింగమనేని రమేశ్‌ ఎందుకు స్పందించటం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించాడు. లింగమనేని గెస్ట్‌ హౌస్‌కు నోటీసులు ఇస్తే.. పచ్చ మీడియా, టీడీపీ నేతలు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు రాద్ధాంతం చేయడంపై మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ ఆర్కేను ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పదవి పూర్తయిన తర్వాత తమ భూములు అప్పగిస్తామంటూ రహదారి నిర్మాణం కోసం రైతులు శేషగిరిరావు, దాసరి సాంబశివరావు నుంచి అధికారులు భూమిని తీసుకుని ఆ మేరకు 2015లో ఒప్పంద పత్రం రాసిచ్చారు. అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమ భూములు ఇచ్చేయాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రైతులతో కలిసి ఆర్కే ఆ భూములను పరిశీలించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కట్టడంపై ఇచ్చిన నోటీసులపై స్పందించని లింగమనేని ఎక్కడున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికి రోడ్డు పేరుతో అప్పటి ప్రభుత్వం రైతులను బెదిరించి భూములను తీసుకుందని విమర్శించారు. కేవలం 10 అడుగులు మాత్రమేనని చెప్పి ఒక్కొక్కరి నుంచి 20 సెంట్ల భూమిని కబ్జా చేశారని మండిపడ్డారు. భూమిని లాక్కోవడమే కాకుండా నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని తెలిపారు. రైతులకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని స్పష్టం చేశారు. భూమిని రైతులకు తిరిగి ఇస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు