కొత్త పద్ధతిలో చంద్రబాబు-లోకేశ్‌ల దోపిడీ

26 Apr, 2018 14:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లు కొత్త పద్ధతిలో ప్రజలను దోచుకోవటం ప్రారంభించారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు. అందుకోసం అన్నా క్యాంటీన్లను తెరపైకి తెచ్చారని ఆయన మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి విధానాలను ఎండగట్టారు. 

ఎన్టీఆర్‌ ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? 
‘2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చి 630 హామీల్లో అన్నా క్యాంటీన్‌ ఒకటి. నాలుగేళ్లుగా ఏ ఒక్క హామీ నెరవేర్చని బాబు.. ఇప్పుడు హడావుడిగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. ఎన్టీఆర్ పేరు వినబడకూడదనే ఇన్నాళ్లు ఆ అంశాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు ఎన్నికల వేళ అన్నా క్యాంటీన్ అంటూ డ్రామాలు మొదలుపెట్టారు. కానీ, ప్రజలు మాత్రం వాటిని ‘అల్లుడి క్యాంటీన్లు’గానే భావిస్తున్నారు’ అని ఆర్కే ఎద్దేవా చేశారు. చంద్రబాబు,ఆయన తనయుడు లోకేశ్‌లు అన్నా క్యాంటీన్ల ద్వారా పెద్ద ఎత్తున్న దోపిడీకి తెరలేపారని ఆర్కే వివరించారు.

‘సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలను అన్న క్యాంటీన్లకు కేటాయిస్తూ టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 163 క్యాంటీన్లకిగానూ రూ. 59 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. అంటే ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి రూ. 36 లక్షలు అన్నమాట. ఆ లెక్కన్న నిర్మాణం కోసం చదరపు అడుగుకి రూ. ఐదు వేలు ఖర్చు చేస్తున్నారు. చివరకు పేదవాడికి అన్నం పెట్టే విషయంలో కూడా అవినీతి చేయాలని చూస్తున్నారు అని చంద్రబాబుపై ఆర్కే మండిపడ్డారు.

నారాయణ ఆ విషయాన్ని గ్రహించాలి... 
‘ఈ అవినీతి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌ సీపీ మీ అవినీతి ప్రభుత్వాన్ని అస్సలు వదిలి పెట్టదు. వైఎస్సార్‌ పాలనను ఆదర్శంగా తీసుకొని పేదలకు ఎంతో కొంత మేలు చెయ్యండి. లేకుంటే ప్రజలు శాశ్వతంగా మర్చిపోతారు’ అని చంద్రబాబుకి ఆర్కే సూచించారు. ఇక నాలుగేళ్లుగా రాజధాని ప్రాంతంలో ఒక్క క్యాంటీన్ అయిన ప్రారంభిస్తారని చూశానన్న ఆయన.. గతేడాది తానే స్వయంగా రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు-లోకేష్ కలిసి అన్న క్యాంటీన్‌ల పేరుతో మంత్రి నారాయణని ఇరికించాలని చూస్తున్నారని.. ఈ విషయాన్ని తెలుసుకోవాలని నారాయణకు ఆర్కే  సూచించారు.

చంద్రబాటు కుటుంబమే ఇంకా రాలేదు... 
చంద్రబాబు కుటుంబమే ఇంకా రాజధానికి రాలేదన్న విషయాన్ని ప్రస్తావించిన ఆర్కే.. రాజధానిలో బాబు ఇల్లు కట్టుకోలేదని తెలిపారు. ‘ముప్పై ఎనిమిది వేల కుటుంబాలు రాజధానికి వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. దోపిడీని కేంద్రం ప్రశ్నించడానికి సిద్ధం అయిన తరుణంలో చంద్రబాబు ప్రజల రక్షణ కోరటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్నపుడు చంద్రబాబుకి గవర్నర్ వ్యవస్థ మంచిగా కనిపించిందని, చివరకు వైసీపీ ఎమ్మెల్యేలని మంత్రి చేసినప్పుడు కూడా ఆయనకు గవర్నర్ వ్యవస్థపై మంచిగానే కనిపించిందని ఎద్దేవా చేశారు. గవర్నర్‌ను చేస్తానంటూ తెలంగాణలో ఒక దళితుణ్ణి చంద్రబాబు మోసం చేశారని ఆర్కే తెలిపారు.

మరిన్ని వార్తలు