‘అమ్మఒడి’ దేశానికే ఆదర్శం: రోజా

17 Jun, 2019 15:15 IST|Sakshi

టార్చర్‌ పాలనకు.. టార్చ్‌ బేరర్‌ పాలనకు చాలా తేడా

సాక్షి, అమరావతి: జనాన్ని ముందుడి నడిపే నాయకుడిని ‘టార్చ్‌ బేరర్‌’ అంటారని, అందుకే ఐదుకోట్ల ఆంధ్రులను ముందుండి నడుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాష్ట్రానికి ఒక ‘టార్చ్‌ బేరర్‌’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగరి శాసనసభ్యురాలు ఆర్‌కే రోజా అన్నారు. శాసనసభలో సోమవారం ఆమె గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా మాట్లాడారు. రాబోయే 30 ఏళ్లు ఈ రాష్ట్రానికి జగనే టార్చ్‌ బేరర్‌ అని అన్నారు. గడిచిన ఐదేళ్లు నరకాసుర పాలన చూశామని, టార్చర్‌ అంటే ఏంటో అందరికీ చంద్రబాబు చూపించారని మండిపడ్డారు. ఆడవారిపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా బాబు స్పందించలేదని, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆడపిల్లలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారన్నారు. 

మహిళల కోసం విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టారని  ఎమ్మెల్యే రోజా అన్నారు. నవరత్నాల్లో ముఖ్యమైనది అమ్మ ఒడి పథకం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు, బిడ్డల చదువుల కోసం రెక్కలు ముక్కలు చేసుకునే మహిళల కష్టాలు తీర్చేలా అమ్మ ఒడి పథకం ఉంటుందన్నారు. అమ్మ ఒడి పథకం కూడా ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌ లాగా దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుందన్నారు. 

45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగు సంవత్సరాల్లో రూ. 75 వేలు అందజేస్తామన్నారు. ప్రజా సంకల్పయాత్రలో అనేక మంది మహిళలు వైఎస్‌ జగన్‌ దగ్గరకు వచ్చిన బాధలు వినిపించారన్నారు. వారి కష్టాలు విని ఈ పథకం ప్రకటించారని, ప్రతి డ్వాక్రా మహిళను ఈ ప్రభుత్వం లక్షాధికారులను చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట ఇస్తే జీఓలు, చట్టాలు అవసరం లేదు అన్న నమ్మకం ప్రతి మహిళకు కలుగుతుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. సొంత ఇంటి కలను కూడా నెరవేర్చే బాధ్యతను ముఖ్యమంత్రి తీసుకున్నారని, ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించి మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయిస్తారని హామీ ఇచ్చారని, తప్పకుండా గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్‌ను చూస్తామన్నారు. 

సూర్యుడు తాను ప్రకాశించడమే కాకుండా, అందరికీ వెలుగును పంచుతాడని, అలాగే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాను గెలవడమే కాకుండా 151మంది ఎమ్మెల్యేల గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకుని విజయం సాధించారన్నారు. ఆ విధంగానే అయిదు కోట్ల ప్రజలకు వైఎస్‌ జగన్‌ అండగా ఉంటారనేది ఈ విషయంలోనే రుజువైందని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ముఖ్యమంత్రి భరోసా కల్పించారన్నారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు మేలు చేసిన ఘటన వైఎస్‌ జగన్‌దేనని ప్రశంసలు కురిపించారు. ఇక దశలవారీ మద్యపాన నిషేధం మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు.

టార్చర్‌ చంద్రబాబు పాలనకు.. టార్చ్‌ బేరర్‌ వైఎస్‌ జగన్‌ పాలనకు చాలా తేడా ఉందన్నారు. పాదయాత్రలో మహిళలు మద్యపానం తమ కుటుంబాల్లో పెట్టిన చిచ్చును జగన్‌ దృష్టికి తీసుకొచ్చారని, ఆ కష్టాలు విని వారి కన్నీళ్లు తుడవాలనే ఉద్దేశంతో దశల వారీగా మద్యపాన నిషేదం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. బెల్టుషాపులు వీధి వీధిన పెట్టి ఆడవారి మాన, ప్రాణాలతో ఆడుకున్న అప్పటి టీడీపీ ప్రభుత్వానికి బాధ అనిపించలేదా..? బ్యాంకుల్లో అప్పుకూడా పుట్టని స్థితికి డ్వాక్రా మహిళలను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. నారాయణ కాలేజీల్లో ఆడపిల్లలు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు మీ చుట్టూ తిరుగుతుంటే మీకు బాధ అనిపించలేదా అని టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. మొదటి సంతకాన్ని కూడా అమలు చేయలేని దౌర్భాగ్యపాలన చంద్రబాబు అందించారన్నారు.

వడ్డీలేని రుణాలు ఇస్తామని రూ. 2350 కోట్లు ఎగనామం పెట్టి డ్వాక్రా మహిళలను నట్టేట ముంచింది గత చంద్రబాబు ప్రభుత్వ కాదా.. అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నది చంద్రబాబు... ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇచ్చిన హామీని నెరవేర్చలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబు.. బోయపాటి శ్రీనుతో యాడ్స్‌ చేయించి డ్వాక్రా రుణమాఫీ చేశామని అబద్ధపు ప్రకటలు ప్రజలపై రుద్ధారని ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై పోరాటం చేస్తామని  సిగ్గు, శరం లేకుండా చంద్రబాబు చెప్పడం ఎంత వరకు సమంజసం అన్నారు. రైతులనే కాకుండా డ్వాక్రా మహిళల రుణమాఫీ, వడ్డీలేని రుణాలను ఎగ్గొట్టి మోసం చేసినందుకు చంద్రబాబు, ఆయన కోటరీ పొర్లు దండాలు పెట్టి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు