చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం

5 May, 2018 14:16 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా

దాచేపల్లి ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గు చేటు

వైఫల్యాన్ని విపక్షంపైకి నెడుతున్నారు

జగన్‌ అధికారంలోకి వస్తేనే మహిళలకు రక్షణ

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రోజా

సాక్షి, విశాఖపట్నం:  దాచేపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అందుకే విపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. శనివారం విశాఖపట్నంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.       

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గు చేటు... 
దాచేపల్లి ఘటనపై ఈ ఉదయం మీడియాతో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. ‘నెల వ్యవధిలో గుంటూరులో ఎన్నో అత్యాచార ఘటనలు జరిగాయి. ఎవరినైనా చంద్రబాబు పరామర్శించారా? వైసీపీ పోరాటం చెయ్యటం వల్లే ఇవాళ సీఎం దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే బాధితురాలిని పరామర్శించారు. మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బాధితులను పక్కన కూర్చోబెట్టుకున్నారు. కానీ, బాధితురాలి వివరాలు చెప్పకూడదన్న నిబంధనలు కూడా తెలియదా?. పైగా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షంపైకి నెడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు సిగ్గు చేటు. 55 ఏళ్ల వృద్ధుడ్ని పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. సుబ్బయ్యకు టీడీపీ  సభ్యత్వం ఇచ్చింది. స్వయంగా మీ ఎమ్మెల్యేనే అతనికి ఇంటికి కేటాయించారు. వీటికి ఏం సమాధానం చెబుతారు’ అని రోజా ప్రశ్నించారు. 

ఇది కొత్తేం కాదు... 
‘రిషితేశ్వరి కేసులో సెటిల్‌ మెంట్‌ చేశారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ నేతలు ఉండటంతో ఆ కేసును నీరుగార్చారు. గుంటూరు జడ్ఫీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌కు అన్యాయం చేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసులో స్వయంగా సీఎం రంగంలోకి దిగి సెటిల్‌మెంట్లు చేశారు. ఐపీఎస్‌ అధికారి సుబ్రహ్మణ్యంపై దాడి కేసు ఏమైంది? ఏడీఆర్‌ రిపోర్ట్‌లో ఐదుగురు టీడీపీ ప్రజా ప్రతినిధుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే 800 కేసులకు పైగా కొట్టేశారు. ఇంక ప్రజలకు రక్షణ ఏది?’ అని ఆమె నిలదీశారు.

టీడీపీ నేతల సంస్కారం ఏది?
‘ఆదాయం కోసం ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా బెల్ట్‌ షాపులు పెట్టేశారు. వాటి మూలంగానే నేరాలు పెరిగిపోతున్నాయి. వైజాగ్‌లో బికినీ షో పెడితే వైసీపీ అడ్డుకుంది. పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇప్పుడు హోం మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే నాపై కొందరు టీడీపీ మహిళా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదేనా వాళ్ల సంస్కారం?.. ముందు మహిళలను గౌరవించటం టీడీపీ నేతలు నేర్చుకోవాలి. అధికారంలోకి మద్యపాన నిషేధం అమలు చేస్తానని వైఎస్‌ జగన్‌ మొదటి నుంచి చెబుతున్నారు. ఆయన అధికారంలోకి వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుంది’ అని ఎమ్మెల్యే రోజా చెప్పారు.

మరిన్ని వార్తలు