‘అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి’

26 Jan, 2020 16:53 IST|Sakshi

సాక్షి, జగ్గయ్యపేట : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణలో చేసి చూపుతున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం ఆయన జగ్గయ్యపేట పురపాలక సంస్థ పరిధిలోని 24,25,26,27 డివిజన్ల వార్డు సచివాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలోని జన్మభూమి కమిటీలకు సచివాలయాల వ్యవస్థకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. జన్మభూమి కమిటీలు టీడీపీ సభ్యుల కోసం పనిచేశాయని ఆరోపించారు. కానీ మతం, కులం, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికి అందాలనే లక్ష్యంతో సీఎం జగన్‌ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.

సచివాలయంలో 72 గంటల్లోనే ఫిర్యాదుదారుడి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. కృష్ణాజిల్లాలో 1280 గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజల అందుబాటులోకి రావడం శుభపరిణామన్నారు. ప్రతి రోజు స్పందన కార్యక్రమం సచివాలయాల్లో జరుగుతుందన్నారు. అమ్మఒడి లాంటి పథకం 70 ఏళ్ల భారత స్వాతంత్ర్య చరిత్రలో ఎవ్వరూ తీసుకురాలేదని ప్రశంసించారు. దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పథకం అమ్మఒడి పథకం అన్నారు. రాష్ట్రంలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. హైదరాబాద్‌ రాజధానిని కోల్పోయినప్పుడు ప్రజలను కన్నీరు పెట్టుకున్నారని అటువంటి పరిస్థితి మరోసారి రాకూడదని సీఎం జగన్‌ ఆలోచిస్తున్నారని చెప్పారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమన్నారు. ఒక లక్షా 10వేల కోట్లు అమరావతిలోనే పెట్టుబడి పెట్టడం వలన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం కాదన్నారు.

మరిన్ని వార్తలు