సంక్షేమ పాలనే సీఎం జగన్‌ లక్ష్యం

8 Mar, 2020 18:45 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్‌మోహన్‌రావు

సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అన్ని సీట్లు కైవసం చేసుకుంటుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ  పాలనను ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు గమనించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే  ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సాహసోపేత నిర్ణయాలతో వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.  ప్రజలంతా సీఎం జగన్‌ వైపే చూస్తున్నారని తెలిపారు. డబ్బు, మద్యం లేకుండా స్థానిక ఎన్నికలు జరగాలన్నదే సీఎం వైఎస్‌ జగన్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ‘అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎన్నిక రద్దు చేస్తామని సీఎం జగన్‌ స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు మంచి పాలన అందించాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు. అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వివరించి ప్రజలను ఓట్లు అడుగుతామని సామినేని ఉదయభాను పేర్కొన్నారు. (ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల నగారా)

ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేస్తోంది: మొండితోక జగన్‌మోహన్‌రావు
ప్రజాస్వామ్యం విలువలు ప్రతిబింబించేలా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు అన్నారు. ఏ విధమైన ప్రలోభాలు లేకుండా ఎన్నికల నిర్వహణ జరగాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు మెచ్చిన..ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు గెలవాలన్నదే ఆయన సంకల్పమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తోందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేశామని వివరించారు. స్థానిక ఎన్నికల్లో విజయ గంట మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు దేశానికే తలమానికంగా నిలవనున్నాయని తెలిపారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉందని జగన్‌మోహన్‌రావు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు