ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారు

13 Aug, 2019 10:29 IST|Sakshi
దేవరపల్లిలో మాట్లాడుతున్న స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత 

సాక్షి, పశ్చిమగోదావరి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. దేవరపల్లి కాకర్ల కల్యాణ మండపంలో సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ పాలన చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించినా పూర్తి స్థాయిలో విడుదల చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సరిపడా బడ్జెట్‌లో కేటాయింపులు చేసిందని, అంగన్‌ వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఆమె తెలిపారు.

ప్రాథమిక పాఠశాలల వద్ద అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని, తొలగించాలనుకుంటే వేతనాలు ఎందుకు పెంచుతామని ఆమె అన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. జిల్లాలో 519 విద్యుత్‌ లైన్‌మెన్‌ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలను మంత్రి వనితకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు కూచిపూడి సతీష్, రాష్ట్ర కార్యదర్శి కె.వి.కె.దుర్గారావు, జిల్లా కార్యదర్శులు గడా రాంబాబు, వెలగా శ్రీరామూర్తి, రాంబాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు