వెయిట్‌ లాస్‌ కోసమే చంద్రబాబు దీక్ష

14 Nov, 2019 15:50 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : వెయిట్‌ లాస్‌ కోసమే చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్నారని, ఆయనకు డేరా బాబాకు ఏం తేడా లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం వాళ్ల ఉనికి కాపాడుకోవడం కోసమే ఆయన తన కుమారుడితో కలిసి పనికిమాలిన దీక్షను చేపట్టారని ఆరోపించారు. ఇసుకలో వేలకోట్లు దండుకున్న చంద్రబాబే ఇప్పుడు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన గురువారం పార్టీ ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్‌, కైలే అనిల్‌ కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 

వరదలతో ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవమే అయినా రాష్ట్రంలో ప్రసుత్తం లక్షా 50 వేల టన్నుల సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల భరోసా కోసమే ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇసుక వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసిన బ్లూ ప్రాగ్‌ సంస్థ యజమాని, చంద్రబాబు సన్నిహితులని వారిద్దరు కలిసి ఒకే ఛాపర్‌లో తిరిగేవారని ఆరోపించారు.

ఐటీ గ్రిడ్‌, బ్లూ ఫ్రాగ్‌ సంస్థలు చంద్రబాబుకు పిల్ల కాలువలుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, అందుకే ఇలాంటి దొంగ దీక్షలు చేస్తున్నారని అన్నారు. బాబు విడుదల చేసింది దొంగ చార్జీషీట్‌ అని దమ్ముంటే ఇసుక ఆరోపణలపై ఆధారాలు చూపించాలని పేర్కొన్నారు. 

అతిపెద్ద ఇసుక దొంగ దేవినేని ఉమానే ! 
చంద్రబాబుకు మతి భ్రమించి దీక్షలు చేస్తున్నారని , ఇసుకపై ఆయన చేస్తున్న దీక్ష దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌ విమర్శించారు. రాష్ట్రంలో అతిపెద్ద ఇసుక దొంగ దేవినేని ఉమామహేశ్వరరావు అని, అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని దీక్ష చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు.  టీడీపీ వేసిన దొంగ చార్జీషీట్‌ను ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరని , ఎన్నికల ద్వారా ప్రజలు గట్టిగా బుద్ది చెప్పినా చంద్రబాబులో ఏ మార్పు రాలేదని తెలిపారు.  ఉమా విధానం నచ్చకనే ఆయన తమ్ముడు ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. తెలంగాణలో కనుమరుగైనట్లే ఏపీలో కూడా టీడీపీ కనుమరుగవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. అయితే గురువారం బాబు దీక్ష నిర్వహిస్తుండగానే దేవినేని అవినాష్‌ వైసీపీలో చేరిన విషయాన్ని కూడా కృష్ణ ప్రసాద్‌ ప్రస్తావించారు.

టీడీపీ నాయకులు గత ఐదేళ్ల పాలనలో అడ్డుగోలుగా ఇసుకను తిని అరిగించుకున్నారని ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ దుయ్యబట్టారు. గత ఐదేళ్ళలో ఇసుక దోచుకోవడంపై పవన్‌కల్యాణ్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఒకవేళ తమ పార్టీ నాయకులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కేసులు పెట్టమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే స‍్వయంగా చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందనటానికి ఇదే నిదర్శనమన్నారు.

మరిన్ని వార్తలు