ఆ లేఖ వెనుక రాజకీయ కుట్ర

20 Mar, 2020 04:38 IST|Sakshi

డీజీపీ సవాంగ్‌కు  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఎస్‌ఈసీ పేరుతో రాసిన లేఖ టీడీపీ కార్యాలయం నుంచే వచ్చింది

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించారు

రాజకీయ ఎత్తుగడలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే యత్నాలు

క్షుణ్నంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై క్షుణ్నంగా విచారించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు గురువారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. లేఖపై ఎస్‌ఈసీ స్పష్టత ఇవ్వకున్నా ఎల్లో మీడియా కథనాలు వండి వార్చడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల కమిషనర్‌ లేఖ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచారం చేయటాన్ని ఖండించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కొలుసు పార్థసారథి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జోగి రమేష్, మల్లాది విష్ణు, టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, కైలే అనిల్‌కుమార్‌ తదితరులు డీజీపీ సవాంగ్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు.

డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులో ముఖ్యాంశాలు ..
1 రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అధికారిక లెటర్‌ హెడ్‌పై, ఆయన చేశారంటున్న సంతకంతో ఓ వర్గం మీడియా ద్వారా విడుదలైన లేఖ రాజ్యాంగబద్ధ పదవి హోదాను దిగజార్చేలా ఉంది. ఒక రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, హైకోర్టు న్యాయమూర్తి హోదా కలిగిన అధికారి ఉపయోగించే పదజాలం కాకుండా రాజకీయ శత్రువులు, కుట్రదారులు వాడే భాషతో ఈ లేఖ విడుదలైంది. టీడీపీ అనుకూల మీడియా ఓ పథకం ప్రకారం దీనిపై బుధవారం మూడు గంటల పాటు పనిగట్టుకుని కథనాలు ప్రసారం చేసింది. 

2 జాతీయ మీడియాకు చెందిన కొన్ని పత్రికలు గురువారం ఈ లేఖను ప్రచురించాయి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రతిష్టకు ఈ వ్యవహారం భంగం కలిగిస్తోంది. రమేశ్‌కుమార్‌ పేరుతో విడుదలైన లేఖపై రాష్ట్ర ప్రయోజనాల రీత్యా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నాం. 

3 ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి కాకుండా టీడీపీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా చంద్రబాబుకు సన్నిహితులైన ఐదుగురు పాత్రికేయుల ద్వారా మిగతా మీడియాకు చేరినట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఎవరెవరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారో, ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని అస్థిరపరచటానికి ఎవరు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారో సమగ్ర విచారణ జరపాలి. బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.

4 ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల కమిషనరే రాశారా? లేక ఇతరులు రాశారా?   రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు, ప్రతిపక్షాల ఊహాగానాలకు ఎందుకు అవకాశం ఇచ్చారు? రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల నిర్వహణ కాకుండా తానే నేరుగా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఎవరి రాజకీయంలో ఆయన భాగం అయ్యారు? బయటకు వచ్చిన లేఖపై ఔననో కాదనో వివరణ ఇవ్వకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అనే అనుమానాలను నిగ్గు తేల్చాలి.

5 రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా అసెంబ్లీలో 86 శాతం సీట్లు, 51 శాతం ఓట్లు, 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే దాదాపు 90 శాతం మేనిఫెస్టో వాగ్దానాలను అమలు చేయడంతో ప్రజల సంతృప్తి మరింత పెరిగి ఏకగ్రీవాలు కావటం సహజ పరిణామం. స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలపై విభేదిస్తున్నట్టు ఎన్నికల కమిషనర్‌ లేఖ పేరుతో ప్రచారం చేయడం అంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని చెప్పటమే.

6 ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ ప్రతిపక్ష టీడీపీ కక్ష సాధింపు వ్యూçహాలు, కుట్రల్లో తానూ భాగమైనట్లుగా వ్యవహరిస్తున్నారు. చివరికి దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరఫున ఎందుకు కేవియట్‌ వేశారు? టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు, చానళ్లు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ఎందుకు నెత్తికి ఎత్తుకుంటున్నాయి? 

7 రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రక్రియను నిర్వహించాల్సిన వ్యక్తికి ఉండాల్సిన స్వతంత్రత, నిష్పాక్షికతకు ఇంతగా భంగం కలగటం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, కమిషనర్‌ పదవికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోరుతున్నాం.

8 ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవటంతోపాటు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేలా ఈ కాలానికి ఎన్నికల నియమావళి వర్తిస్తుందన్న ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు పక్కనపెట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యాలతో తీవ్ర ఆరోపణలు చేస్తూ గంటల వ్యవధిలోనే ఆయన పేరుతో లేఖ విడుదల కావడం అనుమానాలకు తావిస్తోంది. 

9 టీడీపీ అనుకూల మీడియా ఈ లేఖను ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి వాడుకుంది. ఇంత జరుగుతుంటే ఎన్నికల కమిషనర్‌గా ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఆ లేఖ తాను రాసిందో కాదో చెప్పకుండా ఎవరికీ అందుబాటులో లేకుండా మాయమయ్యారంటే ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమని భావిస్తున్నాం.

10 నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆ లేఖను ధ్రువీకరించటంగానీ, నకిలీ ఉత్తరం అయితే బహిరంగంగా ఖండించటంగానీ చేయాలి. ఆ రెండూ చేయకుండా టీడీపీ రాజకీయ ఎత్తుగడల్ని బలపరిచేలా, ప్రభుత్వాన్ని అస్థిరపరచేలా అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన భౌతికంగా, మానసికంగా ఎవరికి బందీగా ఉన్నారు? ఈ విషయాలపై ఒక పనిగా పెట్టుకుని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న పాత్రికేయుల మీద  సత్వరం విచారణ జరపాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే ఈ విషయంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ పోలీసుల సహకారం తీసుకుని నిజాలను బహిర్గతం చేయాలని అభ్యర్థిస్తున్నాం. 

మరిన్ని వార్తలు