-

ఎమ్మెల్యేలుగా గర్వంగా తిరగ్గలుగుతున్నాం

30 Nov, 2019 15:00 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఆరు నెలల పాలనపై ఆయన స్పందిస్తూ.. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సమస్యలను ఆరు నెలల్లో తీర్చారు. లక్షా నలభై వేల మందికి శాశ్వత ఉద్యోగాలిచ్చారు. నాలుగు లక్షల వాలంటీర్ల ఉద్యోగాలతో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. మత్స్యకార భరోసాతో గంగపుత్రుల కష్టాలు తీరనున్నాయి. వీక్లీ ఆఫ్‌ అమలుతో పోలీసు కుటుంబాల్లో ఆనందం నింపారని ఎమ్మెల్యే ద్వారంపూడి వెల్లడించారు.

మరోవైపు ఇదే అంశంపై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ.. అరవై ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రిలా సీఎం జగన్‌ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. ఆరు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదని కొనియాడారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో మాదిగానే సీఎం జగన్‌ పాలనలో ప్రకృతి సహకరించిందని పోల్చి చెప్పారు. ఆరు నెలల్లో 80 శాతం హామీలను నెరవేర్చిన వైఎస్‌ జగన్‌ పాలన చూసి ప్రతిపక్షాలే  ముక్కున వేలేసుకుంటున్నాయని ప్రశంసించారు. జగన్‌ గారి విధివిధానాల వల్ల ఎమ్మెల్యేలుగా ప్రజల్లో సగర్వంగా తిరగగలుగుతున్నామని వెల్లడించారు. రాజకీయ అవగాహన లేకుండా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే పవన్‌కల్యాణ్‌ చదువుతున్నారని దొరబాబు విమర్శించారు. 

మరిన్ని వార్తలు