సీఎం జగన్‌ కుటుంబంపై విషప్రచారం

7 Oct, 2019 12:50 IST|Sakshi

సాక్షి, విజయవాడ : తెలుగు దేశం పార్టీ ఓడిపోయినా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై సోషల్‌ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని,   సమాజం తలదించుకునేలా పోస్టింగ్‌లు పెడుతున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆరోపించారు. సోమవారం ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ని కలిసిన వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్‌, టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, ఉండవల్లి శ్రీదేవిలు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఓడిపోయినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీరు మారలేదని విమర్శించారు. చంద్రబాబు వికృత చేష్టలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి ఎన్ని కుట్రలు చేసినా.. ముఖ్యమంత్రి జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభ కారణంగానే ఎన్‌టీఆర్‌, కోడెల శివప్రసాద్‌ లాంటి నేతలు మరణించారని అన్నారు.

చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా? : ఉండవల్లి శ్రీదేవి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై టీడీపీ చేస్తున్న విషప్రచారంపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా అంటూ ఆగ్రహం వ‍్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యే అయిన తనపై దాడి చేశారని అన్నారు. పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో మంత్రులను తిట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీని సంక్షోభంలో నెట్టారని అన్నారు. 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని కొనియాడారు. సీఎం జగన్‌ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా టీడీపీకి విమర్శించడమే పని అంటూ విమర్శించారు. అసభ్య పోస్టింగ్‌లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

>
మరిన్ని వార్తలు