జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు

29 Jul, 2019 16:59 IST|Sakshi

ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనల్ని పాటించడంలేదు

అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ సభ్యులు

పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ బిల్లుపై చర్చ

సాక్షి, అమరావతి: స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి విద్యావ్యవస్థ పడిలేస్తోందని, ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థలో ఉన్నత ప్రమాణాలను తీసుకురావాల్సిన అవసరముందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ చర్చలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ ప్రస్థానం సరైనమార్గంలో సాగలేదని, విద్యావ్యవస్థను కొందరు అభివృద్ధిపథంలో నడిపితే.. మరికొందరు నిర్వీర్యం చేశారని అన్నారు. గత చంద్రబాబు హయాంలో నాలుగువేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లకు విచ్చలవిడిగా అనుమతులిచ్చిందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఫీజుల పేరిట జలగలు రక్తం పీల్చినట్టు.. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు డబ్బులు పిండుకుంటున్నాయని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. 

భూ యజమాన్య హక్కుల బిల్లుకు ఆమోదం
భూ యజమాన్య హక్కుల బిల్లును ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. డిప్యూటీ సీఎం, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఈ బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూవివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేందుకు ఈ బిల్లు తెచ్చినట్టు తెలిపారు. భూములకు సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేస్తామని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరగనివ్వమని అన్నారు. 

పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌
రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల వసూ లు, ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు వీలుగా పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ శుక్రవారం శాసనసభలో బిల్లులను ప్రవేశపెట్టారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు చైర్మన్లుగా ఉండే ఈ కమిషన్లలో ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనున్నారు. రెండు కమిషన్లకు సివిల్‌ కోర్టు అధికారాలుంటాయి. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడం, విద్యా సంస్థల్లో చేరికలు పెంచడం, డ్రాపవుట్లు తగ్గించడం, సుస్థిర విద్యాభివృద్ధి సాధన, లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులకు అవకాశాలు కల్పించడం ఈ బిల్లుల ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. 

మరిన్ని వార్తలు