టీడీపీ సభ్యులు తీరు మార్చుకోవాలి

23 Jul, 2019 11:25 IST|Sakshi

సాక్షి, అమరావతి : అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వ్యవహార శైలిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ.. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు స్థాయి మరిచి వ్యవహరించారని విమర్శించారు. యువకులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బిల్లు పెడితే టీడీపీ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. ఈ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు గిట్టదని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ బడుగు, బలహీనవర్గాలకు మేలు చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.  

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్‌ మాట్లాడుతూ.. మహిళలకు నామినేటెడ్‌ పదవుల, పనుల్లో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిందని చెప్పారు. మహిళలకు, పేదలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసే మేలు ఓర్వలేకే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌ పెట్టిన బిల్లు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసమే వాడుకున్నారని ఆరోపించారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ... టీడీపీ సభ్యులు సీఎం వైఎస్‌ జగన్‌ మాటలను వక్రీకరించి గందరగోళం సృష్టించేందుకు యత్నించారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభలో రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు