దూకుడు పెంచిన వైఎస్‌ఆర్‌ సీపీ

15 Mar, 2018 12:10 IST|Sakshi

రేపే కేంద్రంపై వైఎస్‌ఆర్‌ సీపీ అవిశ్వాస తీర్మానం

మద్దతు ఇవ్వాలంటూ పార్టీలకు వైఎస్‌ జగన్ లేఖ

పార్లమెంట్‌ త్వరగా ముగియనున్న నేపథ్యంలో నిర్ణయం

టీడీపీ సహా అన్ని పార్టీల మద్దతు కోరనున్న వైఎస్‌ఆర్‌ సీపీ

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరింత దూకుడు పెంచింది. 15 రోజులుగా పార్లమెంట్‌లో పోరాడుతున్నా కేంద్రం ఒక్కసారి కూడా చర్చకు అవకాశం ఇవ్వకపోవడంతో వైఎస్‌ఆర్‌ సీపీ వ్యూహం మార్చింది. పార్లమెంటు సమావేశాలను ముందస్తుగానే వాయిదా వేస్తారనే సమాచారంతో మార్చి 21న కాకుండా రేపు (శుక్రవారం) అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది.

అంతేకాకుండా అవిశ్వాసంపై మద్దతు కూడగట్టేందుకు టీడీపీ సహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కోరనుంది. ఈ మేరకు ఆయా పార్టీల నేతలను వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు కలుస్తున్నారు. బీజేడీ నేత భర్తృహరి మెహతాబ్‌, టీడీపీ ఎంపీ తోట నరసింహం, టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి తదితరులను కలిసిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా రోజే వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు.

కాగా అంతకు ముందు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు సమావేశం అయ్యారు. పార్లమెంట్ సమావేశాలు త్వరగా ముగియనున్న నేపథ్యంలో అవిశ్వాసం పెట్టాలని వైఎస్‌ఆర్‌ సీపీ నిర్ణయించినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, హోదాపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. హోదాపై మొదట నుంచి పోరాడుతుంది వైఎస్‌ఆర్‌ సీపీనే అన్నారు. తమ స్వప్రయోజనాల కోసం చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని, తమ పోరాటం వల్లే చంద్రబాబు దారిలోకి వచ్చారన్నారు. నాలుగేళ్లుగా హోదాపై మాట్లాడని పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికైనా మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు.

ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆందోళన ఇవాళ కూడా కొనసాగింది. గురువారం లోక్‌సభలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌ స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక రాజ్యసభలోనూ ఎంపీ విజయసాయి రెడ్డి ఆందోళన  కొనసాగించారు. అంతకు ముందు వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఏపీకి న్యాయం చేయలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.

మరిన్ని వార్తలు