డీజీపీని కూడా మార్చాలి: వైఎస్సార్ సీపీ

27 Mar, 2019 15:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ ఎందుకు గగ్గోలు పెడుతుందో అర్థం కావడం లేదని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరుకుందని, సొంత ప్రయోజనాల కోసం ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను వాడుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను కూడా పక్కన పెట్టాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇదే విషయంపై మరోసారి ఈసీని కలవబోతున్నట్లు ఆయన తెలిపారు. చదవండి...(ఇంటెలిజెన్స్‌ డీజీపై వేటు)

ఇంటెలిజెన్స్‌ శాఖ  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారి సమాచారాన్ని సేకరిస్తోందని, మరోవైపు వైఎస్సార్ సీపీ నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు తప్పుడు పనులకు డీజీపీ, ఏబీ వెంకటేశ్వరరావు కొమ్ము కాస్తున్నారన్నారు. అదృష్టవశాత్తూ ఎన్నికల కమిషన్‌ తమ గోడు విందని, ఏబీ వెంకటేశ్వరరావుపై వేటును స్వాగతిస్తున్నామన‍్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వెనుక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పాత్ర ఉందని, చీకటి చక్రవర్తి తయారు చేసినట్లు ఇప్పుడున్న ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ తయారైందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని, ఇందుకోసం 20మంది హ్యాకర్లను నియమించుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర‍్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్లి మరీ ప్రత్యేక టెక్నాలజీని తీసుకొచ్చారన్నారు. వ్యక్తుల ప్రయివేట్‌ జీవితాల్లోకి చొరబడుతున్నారని ఆయన మండిప్డడారు.

ఈసీ తీసుకున్న చిన్న చర్యకు కూడా టీడీపీ గగ్గోలు పెడుతోందని, ఇంటెలిజెన్స్‌ వ్యవస్థకు, ఎన్నికలకు ఏం సంబంధం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అన్ని ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశామని, టీడీపీ వాదనలో ఎలాంటి హేతుబద‍్ధత లేదన్నారు. కోర్టులో టీడీపీ వాదనలు నిలబడవని, ఇంటెలిజెన్స్‌ ఐజీ తన పరిధి దాటి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారన‍్నారు. ఇక తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని, దీనిపై హైకోర్టులో కేసు వేసినట్లు ఆయన తెలిపారు.

ఫోన్‌ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిటిషన్‌
కాగా ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీకి చెందిన పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, 13మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఇవాళ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కౌంటర్‌ ఇంజెలిజెన్స్‌ ఎస్పీ భాస్కర్‌ భూషన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా చేర్చారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు సమర్పించారు. మరోవైపు ఎన్నికల కమిషన్‌ వేటు వేసిన ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ఇక ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..కేంద్ర ఎన్నికల సంఘానికి ఏడు పేజీల లేఖ రాశారు.

మరిన్ని వార్తలు