దేశంలోనే ఏపీ నెంబర్‌వన్‌గా నిలిచింది: మిథున్‌ రెడ్డి

23 Apr, 2020 12:04 IST|Sakshi

సాక్షి, విజయవాడ: లాక్‌డౌన్‌ అమలులో ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాల ఆదర్శంగా తీసుకుంటున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అన్ని రాష్ట్రాలు అభినందిస్తున్నాయన్నారు. ఎంపీ మిథున్‌ రెడ్డి గురువారమిక్కడ మాట్లాడుతూ.. ‘ కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఐసీఎంఆర్‌ ప్రకటనతో జాతీయ మీడియా అంతా సీఎం జగన్‌ను అభినందిస్తోంది. (కరోనా పరీక్షల్లో ఏపీకి మొదటి స్థానం)

అలాగే రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల కంటే ముందున్నారు. ఏపీని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరాం. ఎఫ్‌ఆర్‌బీఎం (ద్రవ్య నిర్వహణ.. నియంత్రణ)ని సడలించాలని, పరిశ్రమలు, పేదలకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. అలాగే వైద్యపరంగా మౌలిక వసతులు కల్పనకు సహాయం చేయాలని కోరాం. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ తరువాత ఉపశమన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. (సంక్షోభం ముప్పిరిగొన్నా.. సంక్షేమానికే పెద్ద పీట)

ఇక ఈ సంక్షోభ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడం సరికాదు. ఇటువింటి సమయంలో ఆయన సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేస్తున్నారు. దేశం అంతా సీఎం జగన్‌ను ప్రశంసిస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసుకోలేకపోయానన్న అసహనంతో విమర్శలు చేస్తున్నారు.’  అని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు