నాపై దాడికి చంద్రబాబు, లోకేష్‌ కారణం : నందిగం

3 Feb, 2020 16:48 IST|Sakshi

వైఎస్‌ జగన్ పాలన చూసి ఓర్వలేకనే టీడీపీ దాడులు

చంద్రబాబు, లోకేష్‌పై విచారణ జరపాలి

లోకేష్ ఈ జన్మకు ఎమ్మెల్యే కాలేరు: నందిగం

సాక్షి, అమరావతి : తనపై జరిగిన దాడి వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్‌ హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయాలి ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే ఇంతకంటే దారుణాలకు పాల్పడతారని, భవిష్యత్తులో తనపై కనుక దాడులు జరిగితే వారిద్దరే కారణమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పాలన చూసి ఓర్వలేకనే చంద్రబాబు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమాన్ని డైవర్ట్ చెయ్యడానికే టీడీపీ నేతలు ఇలాంటి దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడితే.. లోకేష్ ఈ జన్మకు ఎమ్మెల్యే కాలేడని ఎద్దేవా చేశారు. సోమవారం నందిగాం సురేష్‌ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధి అన్ని చోట్ల జరగాలి అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యంమన్నారు. (బాపట్ల ఎంపీ సురేశ్‌పై టీడీపీ నేతల దాడి)

‘టీడీపీ నేతలు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతిలో అవినీతి చేశారు. రాజధాని ప్రాంతంలోని నిజమైన రైతులకు నష్టం జరగదు. శివరామకృష్ణ కమిటీ అమరావతిని రాజధాని వద్దని చెప్పింది.  రైతులు, దళితులను చంద్రబాబు భయపెడుతున్నారు. ఆయన బెదిరింపులకు లోంగేదిలేదు. దళితులు బాగు పడితే చంద్రబాబు ఓర్చు కోలేరు. దీనిలో భాగంగానే నాపై దాడిచేశారు. రైతులతో చర్చలు జరపడానికి మా ఎంపీ కృష్ణ దేవరాయలును సీఎం జగన్‌ అమరావతికి పంపారు. రైతులతో ప్రభుత్వం చర్చలు జరపకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారు.

అమరావతి రైతుల బాధకు చంద్రబాబు నాయుడే కారణం. తన సొంత ఆస్తుల ధరలు పెరగాలని చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నారు. దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మేం మాటలతోనే సమాధానం చెప్పాం. చేతల్లో చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఐదేళ్లు దోచుకుని, అదీ చాలక జోలె పట్టి జనాన్ని పట్టి పీడించుకు తినాలని బాబు ప్రయత్నం చేస్తున్నారు. అసైన్డ్ భూములు కోల్పోవడంతో, అక్రమంగా దోచుకున్న సంపద జారిపోతున్నాయి కాబట్టి ఈ కుట్ర పన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఇంత దూరం రానవసరం లేదు. రైతులే కాదు, రియల్టర్లు కూడా కలిసే ఢిల్లీ వచ్చారు’ అని అన్నారు. 
 

మరిన్ని వార్తలు