సంప్రదాయాలు మంటగలుపుతున్న సీఎం

24 May, 2018 16:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో విభేదాల కారణంగా సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో విధులకు రావడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ వ్యాఖ్యానించారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాంటి ఆదేశాలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు టీటీడీ సంప్రదాయాలను మంటగలుపుతున్నారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా విజయవాడలో టీటీడీ వివాదంపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘టీటీడీపై వచ్చిన భారీ ఆరోపణలపై బాధ్యత గల సీఎం విచారణ జరిపించాలి. ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వారిపై కక్ష సాధింపు చర్యలు సరికాదు. టీటీడీ బోర్డులో అర్హతలేని వారిని సభ్యులుగా నియమించారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడం కోసం దేవుళ్లను చంద్రబాబు వాడుకుంటున్నారు. ఇన్ని తప్పులు చేస్తున్న చంద్రబాబుకి సీఎంగా ఉండే అర్హత లేదు, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పని చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏం చెయ్యడానికైనా వెనకాడరంటూ’ ఎంపీ వరప్రసాద్‌ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు