చంద్రబాబు ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు : ఎంపీ వరప్రసాద్‌

9 Feb, 2018 11:58 IST|Sakshi
విభజన చట్టంలోని హామీల అమలుకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల నిరసన

సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల నినాదాలతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని హామీల అమలుకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో గళమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. విభజన జరిగి నాలుగేళ్లైనా హామీలు అమలు కాలేదంటూ నిరసనలు వ్యక్తం చేశారు. రైల్వేజోన్‌, కడప ఉక్కు కర్మాగారం, దుగ్గరాజపట్నం పోర్టులు మంజూరు చేయాలంటూ ధర్నాకు దిగారు. సభ్యుల ఆందోళనతో లోక్‌సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా పడింది.

ఈసందర్భంగా వైసీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా ఆంధ్రపదేశ్‌ అన్నివిధాలుగా నష్టపోయిందని, వెంటనే ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవంటూ విమర్శించారు. రాష్ట్రం కోసం ప్రజలంతా రోడ్డెక్కితే చంద్రబాబుకు చీమకుట్టినట్లుగానైనా లేదంటూ మండిపడ్డారు.

నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి అబద్దాలతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని, ఇంకెన్ని రోజుల ప్రజలను మోసం చేస్తారంటూ వరప్రసాద్‌ ప్రశ్నించారు. అరుణ్‌ జైట్లీ కొత్తగా ఏమీ చెప్పకపోయినా సుజనా చౌదరి, తెలుగుదేశం ఎంపీలు చప్పట్టు కొట్టడం ఏంటని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడకుండా మంత్రులు అశోక్‌ గజనతిరాజు, సుజనా చౌదరి, ఇంకా మంత్రి పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించాలన్నారు.

మరిన్ని వార్తలు